ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రపోజల్ ఏపీ తెచ్చిన తర్వాతే తెలంగాణ కూడా ముందడుగు వేసింది. నాడు-నేడు స్ఫూర్తితో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని టీఆర్ఎస్ సర్కారు తెరపైకి తెచ్చింది.
ఇలా.. జగన్ సర్కారు తీసుకొచ్చిన పథకాలు చాలాసార్లు తెలంగాణ ప్రభుత్వానికి ఆదర్శంగా మారాయి. తాజాగా.. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై కూడా ఇలాగే నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయంలో కూడా ఏపీ విధానాలను స్ఫూర్తిగా తీసుకుంది.
గతంలో ఈ నిబంధన ఉన్నా కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు జీవో రూపంలో తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదంటూ జీవో విడుదల చేసింది. అయితే ఇప్పటికే ప్రభుత్వ వైద్యులుగా ఉన్నవారికి ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది.
కొత్తగా ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగాల్లో చేరేవారు.. ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదంటూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో విడుదల చేశారు. ఆల్రడీ ఉద్యోగాలు చేసేవారి విషయంలో.. వారి నియామకాల సమయంలో ఇలాంటి నిబంధనలు లేవు కాబట్టి.. మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు.
ఏపీలో ఇటీవల తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తోంది. దీంతో తెలంగాణలో కూడా దీన్ని పూర్తిగా పగడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు. వైద్య సిబ్బంది కొరతను తీర్చేందుకు నియామకాలపై కూడా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ కోసం త్వరలో ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు.
ఈ నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అనేది కీలక అంశంగా మారింది. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో 1,326 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించారు ఆ శాఖ మంత్రి హరీష్ రావు. తొలిదశలో 1,326 పోస్ట్ లు భర్తీ చేస్తామని, మొత్తం 12,755 ఖాళీలకు విడతల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు.