ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి ముఖ్య అతిధిగా వచ్చారు. ఆయనకు ఆతీధ్యం ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. వచ్చిన అతిధి మోడీది అధికారిక పర్యటన. అయితే దాన్ని రాజకీయ పర్యటనగా ఆ పార్టీ మార్చుకుంది. అందుకే జనసేన నాయకుడిని పిలిపించి మరీ భేటీ వేశారు. ఆ తరువాత బీజేపీ మీటింగ్ కూడా నిర్వహించారు.
సాధారణంగా ప్రధానులు వచ్చినపుడు ప్రముఖలతో భేటీ అవుతారు. అఫీషియల్ కర్టెసీ కాల్స్ ఉంటాయి. అయితే ఏపీలో తమకు ఆతీధ్యం ఇస్తున్న ప్రభుత్వానికి ఇంకా ఏణ్ణర్ధానికి పైగా అధికారం చేతిలో ఉండగానే ఆ ప్రభుత్వాన్ని ఎలా దింపడం అన్న దాని మీద బీజేపీ వారు రాజకీయం చేశారు.
మరుసటి రోజు సభలో దీని మీద ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయో అని అంతా ఆసక్తిగా చూశారు. ప్రధాని సమక్షంలోనే ఆయన పాల్గొన్న సభలోనే ఈ విషయాన్ని అన్యాపదేశంగా అయినా ముఖ్యమంత్రి జగన్ హుందాగా చెప్పారు. అంతే కాదు విపక్షాలు మొత్తం కలసి ఆడుతున్న డ్రామాలకు కూడా అదే సభా వేదిక మీద సరైన జవాబు ఇచ్చారు.
కేంద్రంతో వైసీపీకి ఉన్న సంబంధాలను అనుబంధాలను ఎలాంటి దాపరికం చుట్టరికం అన్న ప్రశ్న లేకుండా గుట్టు విప్పి మరీ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అదే తమ అజెండా అని గట్టిగా నొక్కి జగన్ చెప్పారు. దాని కంటే ఏవీ తమకు ఎక్కువ కాదూ కాబోదు అని క్లారిటీగా చెప్పారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము నిలబడ్డామని జగన్ చెప్పిన తీరు సభికుల హర్షద్వానాలకు అర్హమైంది.
అదే సమయంలో విపక్షాల రాజకీయాలకు, విష ప్రచారానికి అడ్డు కత్తెర వేయగలిగింది. ఏపీలో అత్యంత పటిష్టంగా జగన్ ప్రభుత్వం ఉంది. వైసీపీ రాజకీయంగా ఏ పార్టీ దరిదాపుల్లో లేనంత బలంగా ఉంది. అతి తక్కువ సమయంలో లక్షలాది మంది జనాలతో మోడీ బహిరంగ సభ నిర్వహించడమే కాదు, చరిత్రలో ఏ ప్రధానికీ విశాఖ వంటి మెగా సిటీలో జరగని ఎరగని విధంగా అడుగడుగునా ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి మోడీకి జన నీరాజనం పలికింది వైసీపీ.
అదే సమయంలో బీజేపీ పెద్దలు చేసిందేంటి అన్నది చూసుకుంటే పవన్ కళ్యాణ్ణి పిలిపించుకుని వచ్చే ఎన్నికల కోసం ఎత్తుగడలు వేశారు. తమ కోసం రేపటి తమ సభ కోసం వైసీపీ ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా కాయకష్టం చేస్తున్న వేళ తాపీగా చర్చలు పెట్టి ఏపీలో వైసీపీ ఓడిపోవాలని కోరుకున్నారు.
రాజకీయ పార్టీలు అన్న తరువాత అధికారంలోకి రావాలనుకోవడం సహజం. దానికి వారు ప్రణాళికలు ఎత్తులు జిత్తులు వేసుకోవచ్చు. కానీ దానికి సమయం సందర్భం ఉంటుంది. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు చేయడం తగునా అన్నది బీజేపీ వారి విజ్ఞతకే వదిలిపెట్టేస్తే మంచిది. ఏది ఏమైనా జగన్ ఏపీ కోసం నిలబడిన నాయకుడిగా విశాఖ సభ ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. తన సత్తా చాటారు. శభాష్ అనిపించుకున్నారు.