ఆవు కథ గురించి అందరికీ తెలుసు. ఆవు కథ అంటే చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడమన్న మాట. అలా చెప్పడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కథ కంచికి మనం ఇంటికి అన్నట్లుగా కథ విని వెళ్లిపోతారు….అంతే. ప్రధాని మోడీ విశాఖ బహిరంగ సభలో ఆయనకు జగన్ చేసిన వినతుల సంగతి కూడా అంతే. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని చెప్పొచ్చు. ఏపీకి ఏం కావాలో సీఎం జగన్ చెప్పారు. అమ్మయ్య … ఒక పనైపోయింది బాబూ అనుకోని ఊపిరి పీల్చుకున్నారు. జగన్ వినతులను డస్ట్ బిన్ లో పడేసే అలవాటు మోడీకి ఉంది కాబట్టి ఆయన పట్టించుకోరు. ఇదొక ప్రహసనం అంతే.
జగన్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. కేంద్రంతో ప్రత్యేకించి- ప్రధానితో తమ అనుబంధం- పార్టీలకు, రాజకీయాలకు అతీతమని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో అజెండా లేదని స్పష్టం చేశారు. తమ రాష్ట్రానికి, ప్రజలకు గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసిందని పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రానికి పెద్ద మనసు చేసుకుని మేలు చేయాలని, దీన్ని ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారని వైఎస్ జగన్ అన్నారు.
తాము అనేక మార్లు విజ్ఞప్తి చేసిన అంశాలను మళ్లీ వినిపిస్తున్నానని పేర్కొన్నారు. పోలవరం నిధుల బకాయిలు విడుదల, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలుపుదల, విశాఖకు రైల్వే జోన్ కేటాయింపు తదితర అంశాలపై సానుకూలంగా స్పందించి న్యాయం చెయ్యాలని కోరుతున్నానని అన్నారు.
ఎనిమదేళ్ల క్రితం తగిలిన గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని గుర్తు చేశారు. ఆ గాయాల మానేలా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్రవంతితో అభివృద్ధి చెందేలా చేసే సాయం చేయాలని రిక్వస్ట్ చేశారు జగన్. అలా ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర పునర్‌నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కోసం కేంద్రం చేసే ఏ మంచైనా కూడా ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. విభజన హామీల వద్ద నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వేజోన్ వరకు అన్నింటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో జగన్ చాలాసార్లు ఢిల్లీ వెళ్లారు. వెళ్ళినప్పుడల్లా ప్రత్యేక హోదా కావాలని మోడీని అడిగానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పేవారు. ఈ ఆవు కథ చాలాసార్లు వినిపించారు. గత ఎన్నికల్లో జగన్ గెలవడానికి సగం కారణం కేంద్రం మెడలు వచ్చి ప్రత్యేక హోదా సాధిస్తానని గట్టిగా చెప్పడమే. కానీ ఆ తరువాత సీన్ రివర్స్ అయింది.
బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారం చేపట్టింది. దాంతో జగన్ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదని, బీజేపీకి ఇంత మెజారిటీ వస్తుందని ఊహించలేదని, కాబట్టి మనం కేంద్రాన్ని డిమాండ్ చేయలేమని చెప్పారు. వినతులు ఇస్తూనే ఉండాలన్నారు. దానిలో భాగంగా ఇప్పుడూ అదే పని చేశారు. కేసీఆర్ మాదిరిగా జగన్ ఎప్పుడూ కేంద్రాన్ని నిలదీయలేదు. అంతకు ముందు చంద్రబాబు చేసిన పనే ఈయనా చేశారు.