మోడీపై పొగడ్తల్లో మూడు రాజధానుల అంశం

దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాల్లో మెజారిటీ ప్రభుత్వాలు ప్రధాని మోడీని, కేంద్రంలోని బీజేపీ సర్కారును చీల్చి చెండాడుతున్నాయి. ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణా, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ….ఇలా చాలా ప్రభుత్వాలు విరుచుకుపడుతున్నాయి. …

దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాల్లో మెజారిటీ ప్రభుత్వాలు ప్రధాని మోడీని, కేంద్రంలోని బీజేపీ సర్కారును చీల్చి చెండాడుతున్నాయి. ఘాటుగా విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణా, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఢిల్లీ….ఇలా చాలా ప్రభుత్వాలు విరుచుకుపడుతున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగా బీజేపీయేతర ప్రభుత్వాల్లో ఏపీ ప్రభుత్వం వేరు.ఇతర ప్రతిపక్ష ప్రభుత్వాల్లా మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడంలేదు. విరుచుకుపడటంలేదు.

కానీ రాష్ట్రంలోని బీజీపీ నాయకులు మాత్రం జగన్  ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. విశాఖలో ప్రధాని మోడీ బహిరంగ సభలో జగన్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. పొగడ్తల వాన కురిపించారు. ప్రధాని మీద గౌరవంతో అలా చేశారో, ఇంకా  ఏదైనా కారణం ఉందేమో తెలియదు. 

జగన్ చాలా తెలివిగా ఏపీకి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూనే, వాటిని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా తన మనసులోని చిరకాల కోరిక మూడు రాజధానుల విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంటే మూడు రాజధానులుకు అడ్డుపడొద్దని చెప్పారని అనుకోవాలి. 

జగన్‌ మాట్లాడుతూ.. ''విశాఖపట్నంలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం జనసంద్రాన్ని తలపిస్తోంది. జన కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఉత్తరాంధ్ర జనం ప్రభంజనం మాదిరిగా కదిలివచ్చింది. ఇవాళ దాదాపు రూ.10వేల కోట్లు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు ప్రధానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు అన్నమాట )  పారదర్శకత రాష్ట్రంలో మా ప్రాధాన్యత.

ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదు. పెద్ద మనస్సుతో మీరు చూపే ప్రేమ ప్రజలంతా గుర్తుపెట్టుకుంటారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశాం. ఏపీకి సహాయ సహకారాలు అందించాలి'' అని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. 

జగన్ చెప్పింది మోడీకి అర్థమైందా? రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం అమరావతికి కట్టుబడి ఉన్నామంటున్నారు.