ఏదో సమ్ థింగ్ న్యూ వుండాలి. లేదా సమ్ థింగ్ స్పెషల్ వుండాలి. అప్పుడే జనాలు కాస్త ఆసక్తిగా థియేటర్ వైపు చూస్తారు.లేదంటే లేదు. ఇలాంటి నేపథ్యంలో సినిమా జనాలు కాస్త కొత్తదనం వుండేలా చూసుకుంటున్నారు.
అలిపిరికి అల్లంత దూరంలో అంటూ తయారవుతున్న సినిమా ట్రయిలర్ కూడా ఇదే పాయింట్ ను చెబుతోంది. అవసరం..దొంగతనం..పరిశోధన..ఇలాంటి పాయింట్లు తెలుగు సినిమాకు కొత్త కాదు. కానీ తిరుపతి నేపథ్యంలో కథ నడవడం అన్నది కాస్త కొత్త.
ప్రేమలో పడిన కుర్రాడు..అతగాడికి తిరుపతిలో ఓ దుకాణం..డబ్బు అంతరం..అలాంటి టైమ్ లో అనుకోకుండా కుర్రాడి చేతికి భారీ మొత్తం చిక్కడం. దానిపై పరిశోధన..పోగొట్టుకున్న బడాబాబుల హడావుడి ఇవన్నీ కలిసి ట్రయిలర్ లో చోటు చేసుకున్నాయి. జనాలకు పరిచయం అయిన తిరుపతి దృశ్యాలు సహజంగానే కనెక్ట్ అయ్యేలా వున్నాయి. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రమిది. డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రాజరాజ చోర, బ్రోచేవారెవరురా, స్వామి రారా లాంటి రాబరీ డ్రామాలు మంచి విజయాలు అందుకున్నాయి. 'అలిపిరికి అల్లంత దూరంలో' విషయానికి వస్తే రాబరీతో పాటు డివైన్ ఎలిమెంట్ కూడా కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్స్ లో విడుదలౌతోంది.