ఎల్లో పత్రికలో తప్ప, విశాఖ బహిరంగ సభా వేదికపై బీజేపీ రాజ్యసభ సభ్యులకు చోటు దక్కలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వభావం తెలిసి కూడా, వైసీపీ నేతలకు ప్రాధాన్యం లేదంటూ ఎల్లో పత్రిక కథనాలు రాసి చివరికి అభాసుపాలైంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, అలాగే పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోదీ విశాఖ వచ్చారు.
ఈ సందర్భంగా విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సంబంధించి వైసీపీ నేతలకు అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ చంద్రబాబు అనుకూల పత్రికలో కథనం రావడం చర్చనీయాంశమైంది. బహిరంగ సభావేదికపై మోదీ సహా 9 మందికి మాత్రమే స్థానం కల్పించారని కథనంలో పేర్కొన్నారు. అయితే సభను విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కలేదని సదరు పత్రిక ముందుగానే రాయడం విశేషం.
ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం జగన్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వాకాటి నారాయణరెడ్డి మాత్రమే వేదికపై వుంటారని జోస్యం చెప్పారు. సీఎం, విశాఖ ఎంపీ మినహా మిగిలిన వారంతా బీజేపీ నాయకులేనని పేర్కొనడం గమనార్హం.
అయితే ఇవాళ సభ జరిగిన తీరుకు, ఆ కథనానికి పూర్తి విరుద్ధంగా వుంది. సభా వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, కేంద్ర రైల్వేశాఖ మంత్రి మాత్రమే ఉన్నారు. తమకు గిట్టని ప్రభుత్వాన్ని, పార్టీని అభాసుపాలు చేసే క్రమంలో, సదరు మీడియా సంస్థే విశ్వసనీయత కోల్పోవడం చర్చనీయాంశమైంది. జగన్ సర్కార్‌పై సదరు పత్రిక రాసే కథనాల్లోని వాస్తవాలు ఎలా వుంటాయో… తాజా కథనమే నిలువెత్తు నిదర్శనమని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సెటైర్స్ విసురుతున్నారు. అయ్యో పాపం సీఎం రమేశ్, జీవీఎల్ అంటూ అధికార పార్టీ నేతలు సానుభూతి చూపడం గమనార్హం.