చప్ప చప్పగా మోడీ ప్రసంగం… నిరాశతో జనం

దాదాపుగా ఏడేళ్ల తరువాత మోడీ ఒక పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమానికి ఏపీలో శ్రీకారం చుట్టారు. 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి వెళ్ళిన తరువాత ఇన్నేళ్లకు ఏపీకి వచ్చి విశాఖ…

దాదాపుగా ఏడేళ్ల తరువాత మోడీ ఒక పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమానికి ఏపీలో శ్రీకారం చుట్టారు. 2015 అక్టోబర్ 22న అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి వెళ్ళిన తరువాత ఇన్నేళ్లకు ఏపీకి వచ్చి విశాఖ వేదికగా మరిన్ని కొత్త కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన చేశారు.

నాడూ నేడూ కూడా మోడీ స్పీచ్ డిటోగానే సాగింది. ప్రజలు కోరుకున్న ఒక్క అంశం కూడా ప్రధాని నోటి వెంట భరోసాగా రాకపోవడంతో మరోసారి ఏపీ జనాలు నిరాశపడ్డారు. మోడీ ప్రసంగం అంతా చప్ప చప్పగా సాగింది. మోడీ నోటి వెంట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటుందని ప్రకటన వస్తుందని ఆశపడిన స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భంగపడ్డారు.

ప్రత్యేక హోదా గురించి ఎంతగా మరచిపోయినా ఏదో ఒక ఆశ. ఏదో నాటికి ఏదో ఎన్నికల ముందు అయినా ప్రధాని ఆ వరాన్ని ఇస్తారని అయిదు కోట్ల ఆంధ్ర జనాలు ఆశిస్తూ వచ్చారు. కానీ చివరికి అది కూడా మరోసారి నిరాశగానే మిగిలింది. ఏపీకి దండీగా నిధులిచ్చి ఆదుకోవాలని సీఎం సభలో కోరినా కూడా మోడీ నుంచి ఆ దిశగా ఆశావహ ప్రకటన ఏదీ లేదు.

ఆయన ప్రసంగం ఆద్యంతం దేశంలో ఎన్నో చేశాం, ఆ పధకాలూ ఈ కార్యక్రమాలూ అంటూ సాగిపోయింది. విశాఖకు వచ్చి అందరికీ తెలిసిన సుందర నగరం గురించి నాలుగు మంచి మాటలు చెప్పడంతో సరిపెట్టారు అన్న విమర్శలూ ఉన్నాయి.

వికాస భారతం అంటూ భారీ పదాలతో గంభీర ప్రసంగం చేసిన మోడీ గత ఎనిమిదేళ్ళుగా విభజన గాయాలతో కునారిల్లిన ఏపీకి నిఖార్సుగా ఏమి చేద్దామనుకుంటున్నారో చెప్పకపోవడం భారీ వెలితిగానే అంతా భావిస్తున్నారు.

మోడీ విశాఖకు వచ్చారు వెళ్లారు అన్నట్లుగానే ఆయన కార్యక్రమం ఉంది అన్న వేడి నిట్టూర్పులే ప్రత్యక్షంగా ఆయన సభలో పాల్గొన్న జనాల నుంచి వస్తున్నాయి. టీవీల నుంచి చూసిన తెలుగు జనాలూ అదే మాట అనుకుంటున్న పరిస్థితి ఉంది.