లంక గుట్టు విభీషణుడు చెప్పాడు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే కధ మొత్తం సాగింది. ఇపుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి గుట్టు మట్టూ కూడా తెలిసిన వారు ఒకే ఒక్కరు. ఆయనే నిన్నటి దాకా అన్న వెంట ఉండి ఇపుడు వైసీపీలో చేరిన చింతకాయల సన్యాసిపాత్రుడు. ఆయన చెప్పినదే నిజమని జనం కూడా నమ్ముతున్నారు.
తన సొంత కుటుంబాన్నే నాశనం చేసి తన రాజకీయం తాను అయ్యన్న చూసుకున్నారని తమ్ముడు సన్యాసిపాత్రుడు ఆరోపిస్తున్నారు. అయ్యన్నపాత్రుడు అక్రమ గంజాయి వ్యాపారం చేస్తారని, అలాగే మైనింగ్ వ్యవహారాల్లో ఆయన హస్తం ఉందని తమ్ముడు అంటున్నారు.
ఇక అయ్యన్న అడ్డాగా మారిన విశాఖ రూరల్ జిల్లాలో అనేక అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా సన్యాసిపాత్రుడు అంటున్నారు. ఇవే మాటలను వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చెప్పుకొచ్చారు.
అయ్యన్నపాత్రుడు జాతకం మొత్తం తమ వద్ద ఉందని, ఆయన అవినీతిని బయటపెడతామని అంటున్నారు. సరే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళకు పై దాటింది. అయ్యన్నపాత్రుడు విశాఖ రూరల్ జిల్లాలో ఇన్ని అక్రమాలు చేస్తూంటే వైసీపీ సర్కార్ ఇంతకాలం ఎందుకు వాటి మీద విచారణ జరిపించలేదు అన్న డౌట్లు కూడా ఇపుడు అందరికీ వస్తున్నాయి.
దీనికి సమాధానం కూడా ఉంది. అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి అయినా ఇంకా పవర్ ఫుల్ గా ఉన్నారనే అనుకోవాలి. లేకపోతే వైసీపీ నేతలు కేవలం మాటలకే పరిమితమని అని భావించాలేమో.
ఏది ఏమైనా అయ్యన్న అక్రమాల చిట్టా వల్లె వేస్తున్న వైసీపీ పెద్దలు ఆయన నిజంగా అక్రమాలు చేసి ఉంటే ఆయన మీద ఈ రోజుకైనా దర్యాప్తు చేయాలనే అంతా కోరుతున్నారు. లేకపోతే దీన్ని ఊకదంపుడు రాజకీయంగానే తీసుకునే పరిస్థితి ఉంది.