ఎమ్బీయస్‍: అఫ్గన్ సంస్కరణవాదిని తప్పించిన బ్రిటన్

అమానుల్లా అధికారంలోకి రాగానే బ్రిటిష్ వారి పెత్తనానికి స్వస్తి పలకదలుచుకున్నాడు. ఇండియన్ ముస్లిములలో, పంజాబ్‌లో చెలరేగుతున్న అసంతృప్తిని గమనించి, యిదే సరైన అదనని ఇండియాపై దండెత్తాడు. కావాలనుకుంటే బ్రిటన్ తనకున్న సైన్యంతో యుద్ధం చేసి…

అమానుల్లా అధికారంలోకి రాగానే బ్రిటిష్ వారి పెత్తనానికి స్వస్తి పలకదలుచుకున్నాడు. ఇండియన్ ముస్లిములలో, పంజాబ్‌లో చెలరేగుతున్న అసంతృప్తిని గమనించి, యిదే సరైన అదనని ఇండియాపై దండెత్తాడు. కావాలనుకుంటే బ్రిటన్ తనకున్న సైన్యంతో యుద్ధం చేసి ఓడించవచ్చు కానీ ఎందుకీ తలనొప్పి అనుకునే మూడ్‌లో వుండడం చేత మీకు స్వాతంత్ర్యం యిచ్చేశాను పొండి అంది. ఆ విధంగా అమానుల్లాకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది. రాజకీయ కుట్రలతో గద్దె కెక్కినా అతను ఆధునిక భావాలు కలవాడు. టర్కీలో కెమాల్ పాషా తరహాలో దేశంలో సంస్కరణలు తెచ్చి దేశాన్ని నూతనపథంలో నడపాలనే లక్ష్యం వున్నవాడు. అతనికి అతని భార్య సౌరియా తోడైంది. ఆమె కొంతకాలం యూరోప్‌లో చదువుకుంది. ఆడవాళ్లకు బురఖా ఏమిటి, నాన్సెన్స్ అనేది. మధ్యయుగాల్లో వుండిపోయిన తమ దేశాన్ని అతి త్వరగా పాశ్చాత్యీకరణవైపు నడిపించాలని దంపతులిద్దరూ తాపత్రయ పడ్డారు.

వీళ్లకు ఆదర్శంగా నిలిచిన కెమాల్ పాషా (1881-1938) గురించి కాస్త చెప్పాలి. అతను టర్కిష్ ఆర్మీలో ఫీల్డ్ మార్షల్‌గా చేశాడు. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత టర్కీలో అంతర్యుద్ధం జరిగి, అతని వర్గం నెగ్గింది. 1923లో టర్కీని రిపబ్లిక్‌గా ఏర్పరచి, ప్రెసిడెంటు అయ్యాడు. చనిపోయేంతవరకు ఆ పదవిలో వున్నాడు. టర్కీని సెక్యులర్ దేశంగా, పారిశ్రామికదేశంగా తీర్చిదిద్దడానికి ఎన్నో సంస్కరణలు చేశాడు. టర్కిష్ అక్షరమాలలో మార్పులు చేశాడు, పౌరులందరికీ ఉచిత నిర్బంధ విద్య నందించాడు. మహిళలకు ఓటుహక్కు కల్పించాడు. అన్నిటికన్న ముఖ్యమైనది ఖలీఫా వ్యవస్థను రద్దు చేశాడు. క్రైస్తవులకు పోప్ ఎలాగో ప్రపంచ ముస్లిములకు ఖలీఫా అలా వుండేవాడు. మతాన్ని, రాజకీయాలను కలపకూడదన్న కెమాల్, ఖలీఫా స్థాయిని తగ్గించ నారంభించాడు. బ్రిటిషు వారు అతనికి మద్దతిచ్చారు. ఇస్లాం వ్యవహారాల్లో బ్రిటన్ కలగజేసుకుంటోందంటూ, దాన్ని వ్యతిరేకించడానికి భారత్‌లో ఖిలాఫత్ ఉద్యమం పుట్టింది.

అప్పటిదాకా స్వాతంత్ర్యోద్యమంలో పెద్దగా పాలు పంచుకోని ముస్లిములు మతపరంగానైనా ఆంగ్లేయులకు వ్యతిరేకమయ్యారు కాబట్టి వారిని ఉద్యమంలోకి ఆకర్షించడానికి గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతిచ్చాడు. ఖలీఫా వ్యవస్థ రద్దయితే మనమెందుకు బాధపడాలి? అంటూ జిన్నా ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. భారత రాజకీయాల మాట ఎలా వున్నా, కెమాల్ ధైర్యంగా ముందుకు వెళ్లాడు. 1924లో ‘‘రాజకీయాల్లోకి దూరకుండా వుంటేనే ఇస్లాం ఘనత మరింత పెరుగుతుంది.’’ అన్నాడు. నెలలోపే అధికారికంగా ఖలీఫా వ్యవస్థను రద్దు చేసేశాడు. ఇతర ముస్లిము దేశాలు అతన్ని సమర్థించకపోయినా జంకలేదు. టర్కీ ప్రజలు కెమాల్‌కే అండగా నిలిచారు. అతన్ని జాతిపితగా కొలిచారు. అతని భావాలు 1919 నాటికే జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాయి. అమానుల్లా అతని బాటలో నడవబోయాడు కానీ కెమాల్ తీసుకున్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన యిబ్బంది పడ్డాడు.

అతను అధికారంలోకి వస్తూనే తన దేశస్తుల కట్టుబొట్టు మార్పించాడు. మగవాళ్లను గడ్డాలు గీసేయమన్నాడు, పంట్లాం, కోటు వేయమన్నాడు. టోపీ పెట్టుకోమన్నాడు. ఆడవాళ్లను బురఖా తీసేయమన్నాడు. సాధారణ జనాల నిరక్షరాస్యత గురించి బాధపడ్డాడు. ఆడపిల్లలతో సహా అందరికీ ఉచిత విద్యను నిర్బంధం చేశాడు. తన దేశపు యువతీయువకులకు యూరోప్ వెళ్లి చదువుకునే సౌకర్యాలు కల్పించాడు. పాలనాయంత్రాంగంలో మార్పులు తెచ్చాడు. మతగురువుల ప్రాబల్యాన్ని తగ్గించాడు. పొరుగుదేశాలతో సంధులు చేసుకున్నాడు. కెమాల్ పాషా సంస్కరణలు చేపట్టేందుకు ముందే అతనికి ప్రజల్లో పలుకుబడి వుంది. ఎవరైనా నోరెత్తితే చావబాదేందుకు అతని వెనక సైన్యం వుంది. పైగా అతను దేశంలోనూ వుంటూ తన స్థానాన్ని పటిష్టంగా వుండేట్లు చూసుకున్నాడు. అమానుల్లా ఆ జాగ్రత్తలు తీసుకోలేదు. అఫ్గనిస్తాన్ టర్కీ కంటె ఎంతో వెనకబడిన ప్రదేశం. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోకుండానే ఒకేసారి పెనుమార్పులు తేవడంతో బాటు, విదేశీయాత్రలు మొదలుపెట్టాడు. యూరోపియన్లు ఆహాఓహో అంటే మురిసిపోయాడు. తన వెనక్కాల బ్రిటన్లు తవ్వుతున్న గోతులను గమనించ లేకపోయాడు.

టర్కీ, అఫ్గనిస్తాన్ దేశాలే కాక, తూర్పు యూరోప్‌లో వున్న అన్ని దేశాలు తమలో తాము మైత్రీ సంబంధాలను పెంపొందించుకోవడానికి రష్యా సహకరించింది. ఇది బ్రిటన్‌కు కన్నెర్ర అయింది. నిజానికి అమానుల్లా చేస్తున్న సంస్కరణలను సిద్ధాంతరీత్యా బ్రిటన్ హర్షించాలి. కానీ దానికి తన ఆధిపత్యమే ముఖ్యం. అందువలన అమానుల్లాను పడగొట్టడానికి మతఛాందసాన్ని ఉపయోగించింది. గమనిస్తే తెలుస్తుంది, నాడు బ్రిటన్ కానీ, నేడు అమెరికా కానీ ఏ పాలకుడైనా అభ్యుదయవాదం వైపు మొగ్గితే వారిని కూలదోయడానికి మతాన్ని వాడుతుంది. దేశంలో మతఛాందసులను రెచ్చగొట్టి, మతయుద్ధం పేర వారిని సమీకరించి, ఆయుధాలిచ్చి, వారిపై ఉసిగొల్పుతుంది. అమానుల్లాపై కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ముల్లాల చేత అతన్ని కాఫిర్ అని తిట్టించింది. 1928లో అమానుల్లా తన భార్యతో కలిసి రోమ్, పారిస్, లండన్, బెర్లిన్, మాస్కో.. యిలా అనేక దేశాలు తిరిగాడు. వెళ్లిన చోటల్లా అతనికి ఘనస్వాగతం లభించింది. అఫ్గనిస్తాన్ ముఖ్యమైన కూడలి కాబట్టి, దానితో వాణిజ్యబంధాలను ఏర్పరచుకుంటామని ఆ యా దేశాలన్నీ ముందుకు వచ్చాయి.

ఈ లోపున అమానుల్లా భార్య ఒక పల్చటి గౌనులో వున్న ఫోటోలు అఫ్గనిస్తాన్‌లో ప్రచారంలోకి వచ్చాయి. ఆమె యూరోప్‌లో యిలాటి దుస్తుల్లో తిరుగుతూ అఫ్గన్ల పరువు తీస్తోందని, ఒక ఇస్లాం మహిళ వుండవలసిన తీరుగా లేదని విమర్శిస్తూ ఆ ఫోటోలను వేలాది అఫ్గన్ గ్రామాల్లో పంచిపెట్టారు. ఇదంతా బ్రిటన్ పనేనని వేరే చెప్పనక్కరలేదు. దీంతోపాటు గ్రామాల్లో మతయోధులకు (జిహాదీ) బ్రిటన్ తుపాకులు పంచిపెట్టింది. ఇదేమీ తెలియని అమానుల్లా విదేశీ పర్యటన ముగించుకుని నూతనోత్సాహంతో తిరిగి వచ్చాడు. వస్తూనే సామంతరాజుల బిరుదులు తీసేశాడు, వాళ్ల అధికారాలు కుదించాడు. మతగురువుల ఆధిపత్యానికి కత్తెర వేశాడు. ఒక కాబినెట్ ఏర్పరచి, తన అధికారాలను వాళ్లకు బదిలీ చేయబోయాడు. స్త్రీలకు మరిన్ని హక్కులు యివ్వడానికి సమాయత్తమయ్యాడు.

అంతే బ్రిటన్ తిరుగుబాటుదారులను ఉసిగొల్పింది. 1928 ఏడాది చివర్లో బచాయీ సకావో అనే జలవాహకుడి నేతృత్వంలో తిరుగుబాటు చెలరేగింది. 1929 నాటికల్లా వాళ్లు నెగ్గారు. అమానుల్లా, అతని భార్య దేశం విడిచి పారిపోయారు. సకావో ఐదు నెలలు పాలించాక, నాదిర్ ఖాన్ అనే సైన్యాధికారి అతన్ని తీసేసి తనే అమీర్ అయిపోయాడు. నాదిర్షాగా పేరు మార్చుకున్నాడు. అతను తన మనిషే కాబట్టి బ్రిటన్ అతనికి ధనసహాయం, ఆయుధసహాయం చేసింది. ఈ నాదిర్ మతగురువులను సంతృప్తి పరచడానికి వారు చెప్పినట్లు చేస్తూనే, యితర విధానాల్లో దేశాన్ని ఆధునీకరించాడు. రోడ్లు వేయడాలు, కమ్యూనికేషన్ సౌకర్యాలు పెంచడాలు, మొదటి యూనివర్శిటీ కట్టడాలు, అమానుల్లా తరహాలోనే యితర దేశాలతో సఖ్యంగా వుంటూ వ్యాపారవ్యవహారాలు చేయడాలూ, బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పరచి తన దేశపు వ్యాపారస్తులకు తోడ్పడాలూ, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు, సైన్యాన్ని పటిష్టపరచడాలూ .. యిలాటివన్న మాట. అయితే అతన్ని నాలుగేళ్ల తర్వాత అంటే 1933 నవంబరులో హత్య చేయడంతో అతని కొడుకు జహీర్ షా గద్దె కెక్కాడు.

జహీర్ షా 40 ఏళ్లు పాలించాడు. బాల్యంలోనే ఇంగ్లీషు, ఫ్రెంచ్ అభ్యసించి, ఉన్నతవిద్యకై ఫ్రాన్స్ వెళ్లిన జహీర్‌ను ఆధునిక అఫ్గనిస్తాన్ నిర్మాతగా చెప్పవచ్చు. అతను అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు పాటించాడు. రెండో ప్రపంచయుద్ధంలో తటస్థంగా వుండడమే కాకుండా, అమెరికా, రష్యాల మధ్య కోల్డ్ వార్ నడిచినప్పుడు యిద్దరి సహాయంతో, విదేశీ సలహాదారుల మార్గదర్శకత్వంలో తన దేశాన్ని ఆధునీకరించిన ఘనుడు. 1944 నుంచి మూడేళ్లపాటు దేశంలోని అనేక తెగల వాళ్లు తిరుగుబాట్లు చేశారు కానీ వాటిని అణచి వేసి శాంతి నెలకొల్పాడు. 1964లో కొత్త రాజ్యాంగాన్ని రాయించి, తన అధికారాలను కుదించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేశాడు. ఎన్నికలు నిర్వహించి, పార్లమెంటు నెలకొల్పాడు. పౌరహక్కులు, మహిళలకు ఓటింగు హక్కులు, మహిళల హక్కులు యిలాటివన్నీ స్థిరీకరించాడు. ఇంకా చాలా చేద్దామనే అనుకున్నాడు కానీ రాజకీయనాయకుల్లో ఏకాభిప్రాయం లేక ముందుకు సాగలేదు. ఇతని సమయంలోనే రాజకీయ పార్టీలు రూపుదిద్దుకోసాగాయి.

1965 జనవరిలో కమ్యూనిస్టు భావజాలంతో, సోషలిస్టులమని చెప్పుకుంటూ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ అఫ్గనిస్తాన్ అని ఏర్పడింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో యిద్దరు ఎన్నికయ్యారు కూడా. నాలుగేళ్లకే అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది. ప్రజల్లో వాళ్లకు కూడా పలుకుబడి వుండేది. 1973లో జహీర్ షా వైద్యం కోసం ఇటలీ వెళ్లినపుడు అతని వద్ద ప్రధానిగా పనిచేసిన అతని కజిన్ మొహమ్మద్ దావూద్ ఖాన్ సైన్యం సాయంతో తిరుగుబాటు చేశాడు. 225 ఏళ్ల రాచరికపు పాలనను అంతం చేసి అఫ్గనిస్తాన్‌ను రిపబ్లిక్‌గా ప్రకటించాడు. అయితే చైనా తరహాలో ఒకే పార్టీ, అంటే తన పార్టీ పాలించాలన్నాడు. జహీర్ షా 2002 వరకు రోమ్‌లో ప్రవాసంలో వున్నాడు. అమెరికన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించాక తిరిగి వచ్చి దేశప్రజల మన్ననలు అందాడు. 2007లో మరణించాడు.

దావూద్ ఖాన్ రాచరికాన్ని రద్దు చేస్తానన్నపుడు కమ్యూనిస్టులు మద్దతిచ్చారు. 1973లో అఫ్గన్ అధ్యక్షుడిగా తనను తాను నియమించుకున్న దావూద్ ఖాన్ నియంతలా పాలించాడు. కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించివేశాడు. 1978 వచ్చేసరికి యిద్దరికీ బాగా చెడింది. కమ్యూనిస్టులు ఆర్మీ సహాయంతో సౌర్ విప్లవం పేరిట తిరుగుబాటు చేసి అతన్ని దింపేసి, చంపేశారు. కమ్యూనిస్టు నాయకుడు తరాకీ అధ్యక్షుడై దేశం పేరుని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గనిస్తాన్‌గా మార్చాడు. చాలా సంస్కరణలు తెచ్చాడు. ఆ తర్వాతి కథంతా ‘‘అమెరికా విరమణ – తాలిబాన్ విజృంభణ – ½’’’ అనే వ్యాసంలో వివరంగా రాశాను.

అఫ్గనిస్తాన్ అనగానే 20 ఏళ్ల క్రితం అమెరికా వచ్చి ఉద్ధరించేదాకా వెనకబడి వున్న దేశం కాదు సుమా, అది ఛాందసం నుంచి ఆధునికత వరకూ అన్ని రకాల దశలనూ అనుభవించింది అని అర్థం చేసుకోవాలి అని వక్కాణించడానికే యీ చరిత్ర అంతా చెప్పాను. అక్కడ యూనివర్శిటీలు ఉన్నాయి. ప్రజలు ఆధునిక నాగరికతనూ రుచి చూశారు. 19వ శతాబ్దంలో బ్రిటన్ తరహాలోనే రష్యా బూచి చూపించి 20వ శతాబ్దంలో అమెరికా అఫ్గనిస్తాన్‌ను మతమౌఢ్యంవైపు మళ్లించింది. 2001లో దాని ఫలితాన్ని అనుభవించింది. 20 ఏళ్లగా ప్రత్యక్షంగా అక్కడే తిష్టవేసి, పరిస్థితిని మరింత క్లిష్టం చేసి వెళ్లిపోయింది. మెజారిటీ అఫ్గన్ ప్రజలకు తాలిబాన్లంటే ఎంత అసహ్యమో, తమలో తాము కొట్లాడుకునే ముజాహిదీన్లన్నా అంతే అసహ్యం. ‘రష్యా ఆక్రమణలో వుండగా కాబూల్ నాశనం కాలేదు కానీ, అంతర్యుద్ధంలో నాశనమైంది. తాలిబాన్లు మతపరంగా హింసలు పెట్టారు కానీ, దేశంలో సుస్థిరత నెలకొల్పారు.’ అని ఒక ఆఫ్గన్ నాయకుడు చెప్పాడు.

ఇప్పుడు తాలిబాన్లకు వ్యతిరేకంగా సాలే చేసిన తిరుగుబాటుకి యితర ఆఫ్గన్లెవరూ మద్దతివ్వలేదు. ఇక అంతర్యుద్ధం వుండకపోవచ్చు కానీ తాలిబాన్లలో మితవాదులు, అతివాదుల మధ్య అంతఃకలహాలుండవచ్చు. మతరాజ్యమో, మరో రాజ్యమో ఎలాగోలా ఆ దేశంలో రాజకీయ సుస్థిరత, శాంతి ఏర్పడడం చుట్టూ వున్న దేశాలన్నిటికీ కావాలి. ముఖ్యంగా చైనాకు స్టేక్ ఎక్కువ. అందుకని తాలిబాన్లకు మొట్టికాయలు వేసైనా, అరాచకం ప్రబలకుండా చూస్తుందనుకోవాలి. తాలిబాన్లు పెట్టే ఆంక్షలను ఎలా ఎదిరించాలి అనేది అఫ్గన్లు చూసుకోవలసిన వ్యవహారం. సౌదీ అరేబియా ప్రజలు ఏం చేస్తున్నారో వీళ్లూ అదే చేయవచ్చు. లేకపోతే గతాన్ని గుర్తు తెచ్చుకుని పాలకుల దమనకాండను ఎదిరించవచ్చు. గత తాలిబాన్ పాలనకు పాక్, అమెరికా దన్ను వుంది కాబట్టి ఎదిరించలేకపోయారు. బయటివాళ్లు కలగచేసుకుంటే ఎంత అనర్థమో ఆఫ్గన్ చరిత్ర చెప్తోంది కాబట్టి వాళ్లు దూరంగా వుండి, ఆ దేశప్రజల్నే నిర్ణేతలుగా వదిలేయాలి. తాలిబాన్లు యీసారి అధికారంలోకి వచ్చిన తీరు గురించి మరో వ్యాసంలో ముచ్చటించుకోవచ్చు. (ఫోటోలు అమానుల్లా, అతని భార్య)

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)

[email protected]