ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏవేవీ పీకేశారో నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా లెక్కలేసి మరీ చెప్పారు. తిరుమల శ్రీవారిని శనివారం ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై చెలరేగిపోయారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులపై అయ్యన్న పాత్రుడి మాటలు బాధించాయన్నారు. మంత్రిగా పని చేసిన వ్యక్తి వయసుకు తగ్గట్టు మాట్లాడలేదన్నారు. అయ్యన్న దిగజారుడు మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఇదే కోడెల శివప్రసాద్ హైదరాబాద్ నుంచి విజయవాడకు అసెంబ్లీని తరలించే సమయంలో ఫర్నిచర్‌ను ఇంటికి తరలింపును టీడీపీ నేత వర్ల రామయ్య తప్పు పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు అయ్యన్నపాత్రుడు ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.
అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా కోడెలను మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్యకు చంద్రబాబు ఉసిగొల్పారని రోజా విమర్శించారు. అప్పుడు అయ్యన్నపాత్రుడు ఏమయ్యారని ఆమె నిలదీశారు. ఈ రోజు కోడెలపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చి, ఆయన్ను పొగడుకున్నా అభ్యంతరం లేదన్నారు. కానీ జగన్మోహన్రెడ్డిని, మంత్రులను విమర్శించడం దేనికని ఆమె ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అంటే ఏంటో తెలుసా అని అయ్యన్న ప్రశ్నిస్తున్నారని, ముఖ్యమంత్రి అంటే ఎలా ఉం డాలో జగన్‌ను చూసి తెలుసుకోవాలని ఆమె కోరారు. జగన్ మందు, సినిమా టికెట్లు అమ్ముకుంటున్నారని చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్లు వచ్చి జగన్‌ను రిక్వెస్ట్ చేయడం వల్లే …ముఖ్యమంత్రి సానుకూలంగా ఆలోచించారన్నారు.
జగన్ గురించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… ఏం పీకుతారని అడుగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏవేవీ పీకేశారో ఈ సందర్భంగా రోజా తనదైన శైలిలో వెల్లడించారు. ఆమె మాటల్లోనే…
“నీ ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని జగన్ పీకేశారు. అలాగే అడ్డదారిలో మంత్రి అయిన చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని జెండా పీకేశాలా ఓడించారు” అని చెప్పారు. కావున ఇప్పటికైనా అయ్యన్నపాత్రుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రోజా హితవు చెప్పారు.