ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో ఆకతాయి లీడర్ నోటి దురుసుతో ఇబ్బందిపడుతున్నట్టు ప్రజలు వాపోతున్నారు. చదువు, సంస్కారం… అన్నింటికీ మించి విచక్షణ లేకుండా అతను ప్రత్యర్థి పార్టీకి చెందిన మహిళా నాయకురాలైన మంత్రి రోజాపై నోరు పారేసుకోవడంపై ఆధ్మాత్మిక నగరవాసులు విస్తుపోతున్నారు. సినీ, రాజకీయరంగంలో ఆర్కే రోజా సెలబ్రిటీ.
ఆమెపై వివాదాస్పద విమర్శలు చేస్తే జనసేనాని పవన్‌కల్యాణ్, అలాగే పార్టీ శ్రేణుల దృష్టిలో పడతాననే చిల్లర ఆలోచనలతో నోటికి పని పెడుతున్నాడు. పైగా అధికార పార్టీ వ్యతిరేక మీడియా ఇలాంటి పోకిరీలకు అండగా నిలుస్తుండడం గమనార్హం. మిగిలిన చోట్ల ఎలా వున్నా, తిరుపతిలో ప్రధాన పార్టీలైన వైసీపీ ,టీడీపీ మధ్య సంస్కారవంతమైన పోరు నడుస్తోంది. తిరుపతిలో శత్రు రాజకీయాలకు చోటు వుండదు. కేవలం ప్రత్యర్థి రాజకీయాలను మాత్రమే నగరవాసులు ప్రోత్సహిస్తారు.
అయితే జనసేన రాకతో ఆధ్మాత్మిక నగరంలో రాజకీయ కాలుష్యం ఏర్పడిందనే ఆవేదన వుంది. తాజాగా అరెస్ట్ అయిన కిరణ్ రాయల్ బ్యాగ్రౌండ్ తెలిసిన వారెవరైనా…ఇతనికి పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పటికే ఆలస్యమైందని స్థానికులు అనే పరిస్థితి. జనసేనాని పవన్‌కల్యాణ్‌పై రోజా విమర్శలు చేయగానే, తిరుపతిలో కిరణ్ రాయల్ మీడియా ముందుకొస్తారు. రాజకీయంగా జగన్, రోజా…ఇలా ప్రత్యర్థులపై ఎన్ని విమర్శలు చేసినా ఎవరికీ అభ్యంతరం వుండేది కాదు.
కానీ కిరణ్ రాయల్‌కు తెలిసిందల్లా ఒకటే… రోజా, ఇతర అధికార పార్టీ నేతలపై ఇష్టానుసారం దూషణకు దిగడం. కనీస సంస్కారం, సభ్యత లేకుండా ఎవరెవరితోనో రంకు అంట గట్టడం కిరణ్ రాయల్‌కే చెల్లింది. తనపై అసభ్య దూషణపై మంత్రి రోజా ఫిర్యాదు చేయడంతో నగరి పోలీసులు కిరణ్‌ను అరెస్ట్ చేశారు. కిరణ్ అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులు తెలిస్తే… ఎవరూ అతన్ని సమర్థించే పరిస్థితి వుండదు.
కిరణ్‌పై జనసేన నాయకులకు వ్యక్తిగతంగా ప్రేమ వుండొచ్చు. కానీ అతని తిట్ల పురాణంపై కూడా ప్రేమ పెంచుకుంటే పార్టీకే నష్టం. తిరుపతిలో బలిజలు చెప్పుకోదగ్గ స్థాయిలో వున్నారు. పవన్‌కల్యాణ్ అదే సామాజిక వర్గ నాయకుడు. దీంతో తాను కూడా అదే సామాజికవర్గమన్నట్టు పేరు చివర్లో రాయల్ అని తగిలించుకున్నాడంటే… అతని స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. తిరుమల దర్శనానికి సంబంధించి అతనేం చేస్తాడో టీటీడీ విజిలెన్స్ అధికారులను అడిగితే కథలుకథలుగా చెబుతారు.
ఇలాంటి వాడు జనసేన తిరుపతి ఇన్చార్జ్ కావడం విశేషం. ఇప్పటికైనా కిరణ్ రాయల్ తానుంటున్న ఆధ్మాత్మిక క్షేత్రంపై గౌరవంతోనైనా పద్ధతిగా మసలుకుంటే బాగుంటుంది. లేదంటే ఏం చేయాలో జనమే నిర్ణయించుకుంటారు.