ఎట్టకేలకు 8 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీని జనసేనాని పవన్‌కల్యాణ్ కలుసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత మోదీని కలశానన్న ఆనందం పవన్ మొహంలో మచ్చుకైనా కనిపించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానితో భేటీకి సంబంధించి వివరాలను పవన్ బహిరంగపరచలేదు. అయితే పవన్ అనుకూల మీడియా మాత్రం తనదైన శైలిలో కథనాలు వండివార్చింది.
ఆ కథనాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌ను ప్రధాని పరోక్షంగా హెచ్చరించారనే ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్, ఆయన వెంట వెళ్లిన నాదెండ్ల మనోహర్ మొహాల్లో నెత్తురుచుక్క కరువైందనే ప్రచారం జరగడానికి దారి తీసింది. ముఖ్యంగా బీజేపీతో పొత్తులో వుంటూ, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో అనైతిక సంబంధాలు పెట్టుకోవడంపై మోదీ నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు ఎల్లో మీడియాలో రాసిన అంశాల్నే ప్రస్తావిస్తుండడం విశేషం. అవేంటో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని, అలాగే ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా… ఇక్కడి విషయాలన్నీ తనకు తెలుసనీ మోదీ అన్నట్టు రాసుకొచ్చారు. రాష్ట్ర పరిస్థితులపై ఏకరువు పెడుతుండగా… ప్రధాని జోక్యం చేసుకుంటూ ఇంకా, ఇంకా అన్నారని, తనకు ఇది కూడా తెలుసని ఆయా సందర్భాల్లో మోదీ అన్నట్టు వార్తా కథనాలు రాయడం విశేషం.
పవన్ చెబుతున్న ప్రతిదీ తనకు తెలుసని ప్రధాని అనడం వెనుక… నీ రాజకీయ పంథా గురించి కూడా అని మోదీ చెప్పకనే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. తమతో పొత్తులో వుంటూ, ఆప్షన్లు పెట్టడం, అలాగే జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనంటూ చంద్రబాబుకు దగ్గరవడం తదితర అంశాలన్నీ తనకు తెలుసనే హెచ్చరికను పరోక్షంగా ప్రధాని చేశారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
అవినీతి, కుటుంబ పార్టీలకు దూరంగా వుంటూ, 2024 ఎన్నికల్లో జనసేనతో మాత్రమే కలిసి వెళ్లాలనే తమ ఆకాంక్షలకు విరుద్ధంగా పవన్ వెళుతున్నట్టు మోదీకి బీజేపీ నేతలు బ్రీప్ చేశారని సమాచారం. అందుకే పవన్‌ను దారికి తెచ్చుకునే క్రమంలో సీరియస్‌గా మాట్లాడినట్టు చర్చ నడుస్తోంది. తాను అకున్నదొకటి, ప్రధానితో భేటీలో అయ్యిందొకటి. ఈ విషయాలన్నీ మీడియాకు ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్లే… పవన్ తలకిందులవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.