మీటింగ్ ఒక‌రితో…డేటింగ్ మ‌రొక‌రితో!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సెటైర్స్ విస‌ర‌డంలో మంత్రి అంబ‌టి రాంబాబుది ప్ర‌త్యేక శైలి. ప‌వ‌న్ సామాజిక వ‌ర్గానికే చెందిన అంబ‌టి రాంబాబు ఏ చిన్న అవ‌కాశం దొరికినా జ‌న‌సేనానిపై విరుచుకుప‌డుతుంటారు. త‌మ‌ను ప‌వ‌న్ ఒక‌టంటే, వైసీపీ…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సెటైర్స్ విస‌ర‌డంలో మంత్రి అంబ‌టి రాంబాబుది ప్ర‌త్యేక శైలి. ప‌వ‌న్ సామాజిక వ‌ర్గానికే చెందిన అంబ‌టి రాంబాబు ఏ చిన్న అవ‌కాశం దొరికినా జ‌న‌సేనానిపై విరుచుకుప‌డుతుంటారు. త‌మ‌ను ప‌వ‌న్ ఒక‌టంటే, వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు ప‌ది మాట‌లన‌డం చూస్తున్నాం.

తాజాగా ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీపై కూడా అంబ‌టి రాంబాబు త‌న మార్క్ పంచ్ విసిరారు. ఇందుకు ట్విట‌ర్‌ను వేదిక చేసుకున్నారు.

“మోడీతో మీటింగు ! బాబుతో డేటింగ్ !” అంటూ రెండే రెండు చిన్న వాక్యాల‌తో జ‌న‌సేనానికి దిమ్మ తిరిగే సెటైర్ విస‌ర‌డం గ‌మ‌నార్హం. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల ప‌వ‌న్‌, చంద్ర‌బాబు భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. రాబోవు రోజుల్లో.. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వైఖ‌రిపై కూడా చ‌ర్చించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. భ‌విష్య‌త్‌లో క‌లిసి ప‌ని చేస్తామ‌ని ఉమ్మ‌డిగా నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుతో రాజ‌కీయ ప్రేమాయ‌ణం సాగిస్తూ, మ‌రోవైపు ప్ర‌ధానితో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నాడ‌ని ప‌వ‌న్‌పై వ్యంగ్య ట్వీట్ చేయ‌డం నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. దీనికి జ‌న‌సేన కౌంట‌ర్ ఏంటో చూడాలి.