ప్రధాని మోదీ వ్యతిరేక జట్టులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేరిపోయారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోడానికి బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ గత చేదు అనుభవాల దృష్ట్యా మళ్లీ చంద్రబాబుతో జత కట్టడమంటే ఆత్మహత్యా సదృశ్యమనే అభిప్రాయంలో బీజేపీ ఉంది.
అయితే బీజేపీ-జనసేనతో కూటమితో కలిస్తేనే, తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎందుకంటే 2014లో మూడు పార్టీలు కలిసినా కేవలం 1.50 శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకున్నామనే ఆందోళన ఆయనలో ఉంది. ముఖ్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్ సామాజికవర్గం ఓట్లు చీలికతో తాము మరోసారి నష్టపోతామని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బీజేపీకి దగ్గరయ్యేందుకు వెళుతున్న తమను ఆ పార్టీ చులకనగా చూస్తోందనే ఆగ్రహం చంద్రబాబులో లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారని సమాచారం. ఇందులో భాగంగా తిరుపతిలో శుక్రవారం సీపీఐ నేతృత్వంలో మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రలో టీడీపీ పాల్గొంది. పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వ ఆస్తుల్ని అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు.
ఇదే పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్, తిరుపతి ఏకైక కార్పొ రేటర్ ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను దశల వారీగా ప్రైవేటీకరిస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని ఘాటు విమర్శలు చేశారు.
ఒకవైపు బీజేపీకి స్నేహ హస్తం అందిస్తూనే, మరోవైపు ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కలిగించే పోరాటాల్లో టీడీపీ పాల్గొనడం చంద్రబాబు రాజకీయ చతురతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.