ధైర్యంగా క‌దులుతున్నారు.. ఊపందుకున్న ప్ర‌యాణాలు!

దేశం క‌రోనా  సెకెండ్ వేవ్ సృష్టించిన విల‌యం నుంచి ఇప్పుడిప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టుగా ఉంది. ప్ర‌జ‌ల క‌ద‌లిక‌లు మ‌ళ్లీ పెర‌గ‌డం ఇందుకు ఒక రుజువుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో క‌రోనా తీవ్ర‌రూపం…

దేశం క‌రోనా  సెకెండ్ వేవ్ సృష్టించిన విల‌యం నుంచి ఇప్పుడిప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టుగా ఉంది. ప్ర‌జ‌ల క‌ద‌లిక‌లు మ‌ళ్లీ పెర‌గ‌డం ఇందుకు ఒక రుజువుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో క‌రోనా తీవ్ర‌రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వాలు నెమ్మ‌దినెమ్మ‌దిగా ఆంక్ష‌ల‌ను తొల‌గిస్తూ వ‌స్తున్నాయి. 

ప్రభుత్వాల సంగ‌తెలా ఉన్నా.. ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తున్నార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. జూన్ నుంచినే సామాన్య ప్ర‌జానీకం క‌రోనాను లైట్ తీసుకోవ‌డం ప్రారంభించారు. జూన్ నుంచినే వివాహాది వేడుక‌లూ, వివిధ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతూ ఉన్నాయి. వాటికి ప్ర‌జ‌లు బాగానే హాజ‌ర‌వుతూ వ‌స్తున్నారు. పెళ్లిళ్ల‌కు ప్ర‌భుత్వాల అనుమ‌తులు ఎలా ఉన్నా.. ఐదారువంద‌ల మందితో కూడా వేడుక‌లు జ‌రుగుతూ ఉన్నాయి. 

క్ర‌మంగా మాస్కులను కూడా ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టేస్తూ ఉన్నారు. శానిటైజ‌ర్ల ఊసు లేదు, హ్యాండ్ వాష్ ల కొనుగోళ్లు త‌గ్గాయి. ఇలా క‌రోనాను ప్ర‌జ‌లు నెమ్మ‌ది నెమ్మ‌దిగా మ‌రిచిపోతూ ఉన్నారు. ఈ క్ర‌మంలో విమాన‌ప్ర‌యాణాల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని విమాన‌యాన సంస్థ‌లే ప్ర‌క‌టిస్తున్నాయి. ఆయా ఊర్ల‌లో, ప‌ట్ట‌ణాల్లో, న‌గ‌రాల్లో స్థానికంగా తిర‌గ‌డం మాటే కాదు.. న‌గ‌రాల మ‌ధ్య‌న కూడా ప్ర‌యాణాలు ఊపందుకున్నాయి ఇప్ప‌టికే. 

ఆగ‌స్టు నెల‌లో 67 ల‌క్ష‌ల మంది దేశంలోని అంత‌ర్గ‌తంగా విమాన‌ప్ర‌యాణాల‌ను చేసిన‌ట్టుగా విమాన‌యాన సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. జూలైతో పోలిస్తే.. ముప్పై శాతం అధికం ఇది. జూలై నుంచి ఆగ‌స్టు నెల‌కే ఈ సానుకూలత న‌మోదైంది. ఇక ఆగ‌స్టుతో పోలిస్తే సెప్టెంబ‌ర్ లో ప‌రిస్థితి మ‌రింత మెరుగ‌యి ఉండ‌వ‌చ్చు కూడా.

మ‌రోవైపు ఐటీ ఉద్యోగుల విదేశీ ప్ర‌యాణాలు కూడా ఊపందుకున్నాయి. ప్రాజెక్టుల నిమిత్తం ఇన్నాళ్లూ ఆగిన ఆన్ సైట్ వ‌ర్కుల‌కు ఇప్పుడు మ‌ళ్లీ మోక్షం ల‌భిస్తూ ఉంది. రెండు డోసుల వ్యాక్సిన్ పొందిన వారిని వివిధ దేశాలు అనుమ‌తిని ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో.. ఆ ప్ర‌యాణాలు కూడా ఊపందుకున్నాయి. థ‌ర్డ్ వేవ్ భ‌యాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నా.. ప్ర‌జ‌లైతే.. ఫ్రీగా మూవ్ కావ‌డం మొద‌లైందని స్ప‌ష్టం అవుతోంది.