ప్రేమదేశం అనే సినిమా విడుదలై పాతికేళ్లు దాటింది. అప్పట్లో అదో ట్రెండ్ సెట్టర్. కుర్రకారును ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే వున్నాయి.
ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ఆలోచన చేస్తున్నాడట దర్శకుడు కదిర్. అయితే ఇటీవల తమిళ ఇండస్ట్రీ అంతా తెలుగు వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నిర్మాతలు తగ్గిపోయారు.
తమిళ హీరోలు, దర్శకులు అంతా తెలుగు నిర్మాతల వైపు చూస్తున్నారు. అదే బాటులో పడ్డాడు కదిర్ కూడా. తన ప్రేమదేశం సీక్వెల్ ను తెలుగులో నిర్మించి తమిళంలోకి డబ్ చేయాలని అనుకుంటున్నాడట. తెలుగు నటులతో తీస్తాడట. అంతా బాగానే వుంది. కానీ నిర్మాత కూడా కావాలి.
తెలుగు నిర్మాత కోసం చూస్తున్నాడట. అంటే టోటల్ గా సీక్వెల్ ఆలోచన వుంది తప్ప మరేం లేదు. తెలుగు నిర్మాత దొరికి, నటులు సెట్ అయితే అప్పుడు సీక్వెల్ ముచ్చట తీరుతుంది. సినిమాకు క్రేజ్ వుంది.
కదిర్ ఖాతాలో హృదయం, ప్రేమదేశం, ప్రేమికుల రోజు లాంటి మాంచి యూత్ ఫుల్ లవ్ సినిమాలు వున్నాయి. అందువల్ల తెలుగు నిర్మాతలు ఎవరైనా ధైర్యం చేయొచ్చు.