ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంటూ చంద్రబాబు గారి ఇంటి ముందు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష చేసిన నిరసన అధికార పార్టీ చేసిన పెద్ద రాజకీయ తప్పిదం అనకతప్పుదు.
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సభకు హాజరైన చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం కావు. ఉద్దేశ్యపూర్వకంగా ముఖ్యమంత్రిని అవమానించే దురుద్దేశ్యమని అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే తర్వాత ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుండా మరింత చులకన చేసి విధంగా వారి వివరణ ఉన్నది. ఈ మధ్య కేంద్ర మంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ దాక్రే నుద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. వారితో పోల్చుకుంటే అనేక రేట్లు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు పై చట్ట పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఆ మార్గాన్ని వదలి చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పక్కకుపోయి విపక్ష నేతపై దాడి అనే చర్చ జరుగుతోంది. నిరసన ఎప్పుడు అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తాయి. అంతేగాని విపక్ష నేతకు వ్యతిరేకంగా అధికార పార్టీ నిరసన చేస్తే సమాజం అంగీకరించదు. రెండవది ఒకటి రెండు రోజులలో MPTC , ZPTC ఫలితాలు రానున్నాయి. తెలుగుదేశం పోటీలో ఉన్నప్పుడే వైసిపి ఏకపక్ష ఫలితాలను నమోదు చేసుకుంది.
ఇప్పుడు జరిగిన ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించినది కనుక ఫలితాలు అధికార పార్టీకి సహజంగానే పూర్తి అనుకూలంగా ఉంటాయి. చంద్రబాబు ఇంటి ముందు వైసీపీ చేసిన నిరసనకు వ్యతిరేకంగా తెలుగుదేశం మరికొన్ని రోజులు ఆందోళన చేస్తుంది. ఎన్నికల ఫలితాలలో వచ్చిన విజయాన్ని కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగంగా తెలుగుదేశం ప్రచారం చేసుకుంటే. విజయం సాధించిన అధికార పార్టీ మాత్రం గెలుపును ఆస్వాదించడం మాని వివరణ ఇచ్చుకునే పరిస్థితికి నెట్టించుకున్నది.
చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేపట్టకుండా ముఖ్యమంత్రిపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సాహసించరు. ఇప్పుడు అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకున్నా జోగి రమేష్ పై కూడా చర్యలు తీసుకోవాలని విపక్ష తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. ఒక రాజకీయ తప్పిదం అధికార పార్టీని చర్యలు తీసుకునే పరిస్థితి నుంచి సమాధానం చెప్పుకునే పరిస్థితికి నెట్టింది.
– మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి