అటు చూస్తే ‘చిన్నమ్మ’.. ఇటు చూస్తే ‘చిన్నల్లుడు’ ఇదీ విశాఖ ఎంపీ సీటు పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి విశాఖ అన్నది చాలా కీలకం. ఎందుకంటే ఆ పార్టీ అభిమాన వర్గానికి వ్యాపారాలు అన్నీ అక్కడే వున్నాయి. అవన్నీ గత నాలుగేళ్లలో బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అవన్నీ సెట్ కావాలంటే ఎంపీ సీటు చేతిలోకి రావాలి. అందుకే విజయ సాయిని అక్కడి నుంచి తప్పించేలా ప్రచారం సాగించారు. ఎన్నికల సమయం వచ్చింది. ఇప్పుడేం చేయాలి?
ఎందుకంటే నందమూరి ‘చిన్నమ్మ’ పురంధేశ్వరి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. భాజపా తరపున మళ్లీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. అలా చేయాలంటే భాజపా- తేదేపా పొత్తు చిగురించాలి. దానికోసం చిన్నమ్మ చేయాల్సినదంతా చేయాలి.
కానీ ఇక్కడో సమస్య వుంది. బాలయ్య చిన్నల్లుడు భరత్ కూడా ఇదే ఎంపీ సీటుకు గతంలో పోటీ చేసారు. మళ్లీ చేసే ఉద్దేశంలో వున్నారు. ఎమ్మెల్యేకు రావాలని వుందో లేదో తెలియదు కానీ లోకేష్ అయితే అలా రానిస్తారని అనుకోవడానికి లేదు. అందువల్ల ఎంపీకే వెళ్లాల్సి వుంటుంది. అలా చేయాలంటే పొత్తు ధర్మంలో భాగంగా ఈ సీటును భాజపాకు వదలకూడదు.
ఈ రెండింటి సంగతి అలా వుంచితే జనసేన గతంలో ఈ సీటును ఆశించింది. పోటీ చేసింది. కానీ అప్పుడు తేదేపా పొత్తు లేదు. ఇప్పుడు పొత్తు వుంది. మరి ఈ సారి ఇక ఈ సీటు మీద ఆశ పెంచుకుంటుందా? తుంచుకుంటుందా అన్నది చూడాలి.
సిట్టింగ్ ఎంపీ ఎంవివి మళ్లీ పోటీ చేసే ఆలోచనలో వున్నారు. ఆయనకే టికెట్ ఇస్తే ఏ గొడవా లేదు. అలా కాకుండా తేదేపా లేదా భాజపా నుంచి కమ్మవారికి చాన్స్ ఇస్తే జగన్ తన బిసి ట్రంప్ కార్డ్ ను వాడే అవకాశం కూడా వుంది. అలాంటి ఆలోచన వుందని ఏమాత్రం ఉప్పందినా తేదేపా తన ప్లాన్ మార్చుకోవాల్సి వుంటుంది. అప్పుడు చిన్నమ్మా లేదు.. చిన్నల్లుడూ లేడు.
పవన్ మదిలో కూడా విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన వుందని వార్తలు వినిపిస్తూ వున్నాయి. ఎంపీకి వెళ్తే భాజపా ఏదో ఓ మంత్రి పదవి ఇచ్చే అవకాశం వుంది. కానీ పవన్ ఎంపీకి వెళ్తారా? అన్నది చూడాలి. అలా వెళ్లాలి అంటే విశాఖ నే ఎంచుకుంటారనే అభిప్రాయాలు వున్నాయి.
ఇవన్నీ ఇలా వుంచితే వైకాపా నాయకుడు విజయసాయి మదిలో తమ అల్లుడిని విశాఖ నుంచి పోటీకి నిలపాలని అనుకుంటున్నారనే వార్తలు వుండనే వున్నాయి. అప్పుడు పోటీ మరింత రసవత్తరంగా వుంటుంది.
మొత్తం మీద విశాఖ ఎంపీ సీటు అన్నది హాట్ సీట్ గా మారేలాగే వుంది.