మల్టీస్టారర్ మూవీ వెనక రాజకీయ లబ్ది?

స్టార్ డమ్ రాక ముందు కలసి పనిచేశారు కానీ.. స్టార్లుగా ఎదిగిన తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్.. ఇంతవరకూ కలసి సినిమా చేయలేదు. ఇక చేయరని కూడా అనుకున్నారంతా. కానీ అనుకోకుండా రజనీ-కమల్ కాంబో…

స్టార్ డమ్ రాక ముందు కలసి పనిచేశారు కానీ.. స్టార్లుగా ఎదిగిన తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్.. ఇంతవరకూ కలసి సినిమా చేయలేదు. ఇక చేయరని కూడా అనుకున్నారంతా. కానీ అనుకోకుండా రజనీ-కమల్ కాంబో తెరపైకి వస్తోంది. అయితే ఈ సినిమా టికెట్ల కోసం కాదు, ఓట్ల కోసం. సినిమా టార్గెట్ ప్రేక్షకులు కాదు, ఓటర్లు. అవును ఇది పచ్చి నిజం. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది.

కమల్-రజనీ కలిసి చేయబోయే మల్టీస్టారర్ సినిమా, తమిళ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీసింది. ఈ సినిమాతో రాజకీయంగా వీళ్లిద్దరూ కలిసి ప్రయాణించే అవకాశాలున్నాయని అంటున్నారు. నిజానికి కమల్-రజనీ కాంబోలో సినిమా అనగానే అంతా దీన్నొక రూమర్ అనుకున్నారు కానీ స్వయంగా కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి దీనిపై గతంలో క్లారిటీ వచ్చింది. కమల్-రజనీ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తారని గతంలో ప్రకటించిన ఆ సంస్థ.. ఈ సమ్మర్ లోనే ఆ మూవీకి కొబ్బరికాయ కొట్టాల్సి ఉంది.

అయితే కరోనా ప్రభావం, లాక్ డౌన్ కారణంగా లోకేష్ డైరక్షన్ లో రావాల్సిన కమల్-రజనీ మల్టీస్టారర్ కాస్త ఆగింది. దీంతో మరోసారి ఈ ప్రాజెక్టుపై అందరూ అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ దీనిపై కమల్ ఆఫీస్ నుంచి తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది చివర్లో సినిమా మొదలై, వచ్చే ఏడాది సెట్స్ పైకి వస్తుందని క్లియర్ గా ప్రకటించారు.

త్వరలోనే తమిళనాట ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఏడాది వేసవి నాటికి ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. తమిళ రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి ఇద్దరూ లేకుండా తొలిసారి జరగబోతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఇటు కమల్, అటు రజనీ ఇద్దరూ భావిస్తున్నారు. ఆల్రడీ మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీ పెట్టి, తమిళనాట అన్ని స్థానాల్లో (234) పోటీచేస్తామని ప్రకటించారు కమల్.

రజనీకాంత్ మాత్రం రాజకీయంగా అంత చురుగ్గా లేరు. పార్టీ విషయంలో కిందా మీదా పడుతున్నారు. రజనీకాంత్ స్టార్ ఇమేజ్ కి పార్టీ పెట్టి పోటీ చేస్తే కచ్చితంగా సీఎం సీటు కొట్టాల్సిందే. తెలుగునాట పవన్ కల్యాణ్ లాగా పోటీ చేసి ఓడిపోతే అది ఆయనకు పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ. అందుకే ఆయన పార్టీ ఏర్పాటు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఒక సినిమా పూర్తవ్వడమే ఆలస్యం, మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రజనీకాంత్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కాదని తేలిపోయింది. అయితే ఇక్కడే రజినీకాంత్ ఓ బ్రహ్మాండమైన ఆలోచన చేశారట. కమల్ హాసన్ తో కలసి సీట్లు పంచుకుని తమిళనాట పోటీ చేస్తే మిత్రలాభంతో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగొచ్చనేది ఆయన ఆలోచన. అధికార అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య ఉంది. అటు డీఎంకేలో స్టాలిన్ ఎదుగుదలను సొంత సోదరుడే ఓర్చుకోవడం లేదు.

ఇలాంటి టైమ్ లో కచ్చితంగా తమిళనాట ప్రత్యామ్నాయం అవసరం. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమల్-రజనీ ప్లాన్ వేశారు. కేవలం కమల్ హాసన్ తో కలిసేందుకే రజనీకాంత్ తన పార్టీ కార్యకలాపాల్ని నెమ్మదిగా జరుపుతున్నారనే ప్రచారం కూడా తమిళనాట ఉంది. ఇద్దరూ విడివిడిగా పోటీచేసి నష్టపోయే కంటే, కలిసి దిగితే కలిగే లాభం ఎక్కువని విశ్లేషకుల అభిప్రాయం.

ఈ రాజకీయ విశ్లేషణల నేపథ్యంలో పరోక్షంగా శ్రేణులకు, ప్రజలకు సంకేతం ఇచ్చేందుకే రజనీ-కమల్ కలిసి ఇన్ని దశాబ్దాల తర్వాత మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి వాళ్లు కథ చూడడం లేదు, వాళ్ల పాత్రల బరువు కూడా చూడడం లేదు. కేవలం తెరపై కలిసి కనిపించాలి, ప్రజలకు ఓ సంకేతం ఇవ్వాలి. ఎన్నికల్లో దిగాలి. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. ఈ మల్టీస్టారర్ వెనక ఇంత రాజకీయం ఉంది మరి. మొన్నటివరకు రాజకీయ శత్రువులుగా ఉన్న ఈ హీరోలకు తమ పార్టీల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాలు ఇప్పుడు కనిపించడం లేదు. 

మోహన్ బాబు కూడా ఫోన్ చేశారు, కానీ నా దేవుడు చెయ్యలేదు