పాలనలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకంగా వుంటున్నాయి. మరి సలహాలు ఎవరు ఇస్తున్నారో, ఆలోచనలు ఎవరు చేస్తున్నారో కానీ ప్రతి పక్షాలకు కిందా మీదా అయిపోయేలా వున్నాయి. కోర్టుల ద్వారా అడ్డుకోవడం మినహా చేసేది లేకపోతోంది. అయినా ఇంకా నాలుగేళ్లు వుంది. ఈ నాలుగేళ్లలో ఎన్ని మార్పులు అన్నా రావొచ్చు. ఏమన్నా జరగొచ్చు.
లేటెస్ట్ గా సువిశాలమైన విజయవాడ పిడబ్ల్యుడి గ్రౌండ్ ను అంబేద్కర్ స్మృతి వనంగా మార్చడం అన్నది నిజంగా కీలక నిర్ణయం. అత్యంత విలువైన వాణిజ్య ప్రదేశాలకు అత్యంతం చేరువగా వుంది కొన్ని ఎకరాల ప్రభుత్వ స్థలం. ఇందులో ఇన్నాళ్లు ఎగ్జిబిషన్లు, పబ్లిక్ మీటింగ్ లు జరుగుతూ వస్తున్నాయి.
చంద్రబాబు హయాంలో దీన్ని ఓ మల్టీ పర్పస్ వాణిజ్య సముదాయంగా మార్చాలనుకున్నారు. కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్, షాపింగ్ సెంటర్ ఇలా అన్ని విధాలుగా ఓ కమర్షియల్ ప్లేస్ గా చేయాలనుకున్నారు. అప్పట్లో లోకల్ గానే అభ్యంతరాలు వచ్చాయి. చరిత్రాత్మకమైన పిడబ్యుడి గ్రౌండ్ ను టచ్ చేయవద్దని అలా పబ్లిక్ యుటిలైజేషన్ కే వదిలేయమని డిమాండ్లు వినిపించాయి.
ఇప్పుడు జగన్ ఏం చేసారు. ఆ సువిశాలమైన గ్రౌండ్ ను అంబేద్కర్ స్మృతివనంగా మార్చేస్తున్నారు. 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ నిర్మించబోతున్నారు. నిజానికి ఇలాంటి ఆలోచన చంద్రబాబు కూడా చేసారు. కానీ ఎక్కడ? అమరావతిలో. కానీ దీన్ని జగన్ విజయవాడ నడిబొడ్డుకు మార్చారు. అంబేద్కర్ అంటే ప్రాణం పెట్టేవారు, తమ దేవుడిగా కొలిచే వారే కాదు, విజయవాడ లో ఓ సువిశాలమైన పార్క్ ను కోరుకునేవారు కూడా ఈ ఆలోచనను హర్షిస్తారు.
కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కక్కలేక, మింగలేక అన్నట్లు వ్యవహరించాల్సిందే. విజయవాడ నడిబొడ్డులోని కమర్షియల్ గా కోట్ల విలువైన స్థలాన్ని జగన్ ఇలా డిసైడ్ చేసారు. భవిష్యత్ లో ఇక ఈ నిర్ణయాన్ని మార్చడం అంటే తేనెతుట్టను కదల్చడమే. అంబేద్కర్ కు అంత్యంత గౌరవ ప్రదమైన స్మృతివనాన్ని చేతల్లో చేసి చూపించిన వ్యక్తిగా జగన్ ఆ సామాజిక వర్గం గుండెల్లో నిలిచిపోతాడు. అమరావతిలో అంత చేస్తాం, ఇంత చేస్తాం అని చెప్పి చంద్రబాబు వార్తల్లో మాత్రమే నిలిచిపోయారు. పాపం.