సీనియర్ నటి జయంతి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్నట్టుగా సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె తనయుడు ఈ విషయాలను ప్రకటించారు. శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన తెలిపారు. ఆమెకు కరోనా టెస్టులు నిర్వహించగా, నెగిటివ్ గా తేలినట్టుగా తెలిపారు. ఆమె చాలా కాలంగా ఆస్మాతో బాధపడుతున్నట్టుగా సమాచారం. వయసు మీద పడుతుండటంతో అనారోగ్య సమస్య ఎదురైనట్టుగా తెలుస్తోంది.
తెలుగు, కన్నడలో బోలెడన్ని సినిమాల్లో నటించారు జయంతి. 1960లలోనే ఆమె నటిగా కెరీర్ ఆరంభించారు. కన్నడతో ప్రారంభించి, తెలుగు, తమిళ, మరాఠీ భాషల్లో జయంతి నటించారు. హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించగా, కేరెక్టర్ ఆర్టిస్టుగా అంతకు మించి గుర్తింపును సంపాదించుకున్నారు.
అన్ని భాషల్లోనూ కలిపి ఆమె సుమారు 500లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో ఆమె నటించారు. పాత తరం హీరోల సరసన హీరోయిన్ గా, చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున వంటి హీరోల సినిమాల్లో అక్క, అత్త తదితర పాత్రల్లో నటించారు జయంతి. కన్నడలో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మరింత ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారామె.