తాలిబాన్ల మీద కోపంతో కొందరు, యావన్మంది ముస్లిములంటే అసహ్యంతో కొందరు అఫ్గనిస్తాన్ అనగానే అది తొలి నుంచి ఒక ముష్కరదేశమని, నాగరికత ఎరగని దేశమని, యితర దేశాల్లో యిబ్బంది తెచ్చిపెట్టడం తప్ప వాళ్లకు వేరే పని లేదనీ అంటున్నారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేశానికి ఉత్థానపతనాలు వుంటాయి. కొన్నిసార్లు అరాచకత్వం రాజ్యమేలుతుంది. అంతమాత్రాన ఆ జాతిని తీసిపారేయడం సబబు కాదు. క్లుప్తంగానైనా వారి చరిత్ర తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. రష్యా ఆక్రమణకు ముందు కూడా అఫ్గనిస్తాన్‌లో కొంతకాలం ప్రగతివాదులు, కమ్యూనిస్టులు పాలించారని, అనేక సంస్కరణలు చేపట్టారని, అనేక యూనివర్శిటీలు అవీ కట్టి, ఆడవారికి సమానావకాశాలు కల్పించారని గుర్తు చేసుకోవాలి. అదే విధంగా గత 20 ఏళ్లగా అఫ్గనిస్తాన్‌లో ఆధునికత వుందని కూడా గమనించాలి. తాలిబాన్లు తుపాకీ చూపించి, భయపెట్టి మతమౌఢ్యాన్ని రుద్దుతున్నారు తప్ప స్వతహాగా జనం మరీ ఛాందసంగా లేరని మనకు అర్థమవుతూనే వుంది. అందువలన వారిని చిన్నచూపు చూడడం మానేసి, కళ్లు తెరుచుకుని చూస్తే యీ మతం పేర రెచ్చగొట్టడమనేది సామ్రాజ్యవాద రాజకీయాల ఫలితమే అని అర్థమవుతుంది.
అఫ్గనిస్తాన్ మహాభారత కాలం నుంచీ వుంది. అప్పట్లో అది గాంధారం. ప్రఖ్యాతి చెందిన కురువంశానికి కోడలుగా రాదగ్గ రాచకుటుంబం అక్కడ పాలించేది. శకుని గాంధార రాకుమారుడు. ఆ దేశానికి ఒక పక్క విశాలమైన పర్షియా (దానిలో కొంత ఇప్పటి ఇరాన్ అయింది) సామ్రాజ్యం, మరో పక్క హిందూస్తాన్ సామ్రాజ్యం. రెండూ నాగరికత పరిఢవిల్లిన దేశాలే. రెండింటికి మధ్య వారధిలా యీ దేశముండేది. అయితే యిది విపరీతమైన పర్వతప్రాంతం కావడం వలన, గ్రామాలు విసిరేసినట్లు ఉండడం చేత, ఏ గ్రామానికి ఆ గ్రామమే ఒక సామంత రాజ్యంగా భావించడం వలన, ఏ తెగకు ఆ తెగ తమదే గొప్పదని అహంకరించడం చేత ఏకీకృతమైన అధికారం పెద్దగా వుండేది కాదు. నాగరికతా ఫలాలు అందరికీ విస్తరించలేదు.
పర్వతప్రాంతం కావడం చేత ప్రజలు మొరటుగా వుండడం సహజమైంది. మధ్య ఆసియాలో సారవంతమైన భూములుండడం చేత ప్రజలు విద్యతో బాటు సమస్తమైన కళలలో, వ్యాపారంలో ఆరితేరారు. కానీ ఆఫ్గనిస్తాన్ అంతా కొండప్రాంతం. అందువలన కళల విషయంలో కాస్త వెనుకబడ్డారు. అయినా శౌర్యానికి, ధైర్యానికి పెట్టింది పేరు. పర్షియా మీదుగా అలెగ్జాండర్ వచ్చినపుడు ఎదిరించినది వీరే. యుద్ధంలో వీళ్లను ఓడించినా చివరకు మంచి చేసుకుంటే తప్ప ఎక్కువకాలం రాజ్యం నిలవదని గ్రహించిన అలెగ్జాండర్ బాక్ట్రియా యువరాణిని భార్యగా చేసుకున్నాడు. తన సేనాని సెల్యూకస్‌ను అక్కడ నియమించాడు. ఇతను మౌర్య చంద్రగుప్తుడికి మావగారు. అఫ్గనిస్తాన్‌లో అలెగ్జాండర్ (స్థానికంగా సికందర్, ఇస్కందర్ అంటారు) పేర చాలా ఊళ్లు వెలిశాయి. కాందహార్ ఊరు కూడా సికందర్ మీదుగానే ఏర్పడిందట. అలెగ్జాండర్ దండయాత్ర సందర్భంగా గ్రీకు సంస్కృతి ప్రభావం భారత దేశంపై పడిందని, రెండిటి శిల్పకళల సమ్మేళన ఫలితంగా గాంధార శిల్పకళ ఏర్పడిందని చిన్నపుడు చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాం. గాంధారమంటే అఫ్గనిస్తానే కదా!
అఫ్గనిస్తాన్‌పై బౌద్ధ ప్రభావం కూడా వుంది. 2001 మార్చిలో తాలిబాన్లు పేల్చేసిన బామియాన్ లోయ బుద్ధ విగ్రహాలు క్రీ.శ. 600 నాటివి. అంటే 1400 ఏళ్ల పాటు వాటిని ఎవరూ ముట్టుకోలేదనేగా! క్రీ.శ. 650లో ఇస్లాం ఆఫ్గనిస్తాన్‌లో ప్రవేశించినా ఆ విగ్రహాల జోలికి ఎవరూ పోలేదు. అఫ్గనిస్తాన్‌పై తూర్పు నుంచి పర్షియా దాడి చేస్తూ వుండేది. ఉత్తరం నుంచి మంగోలియా దాడి చేస్తూ వుండేది. పర్షియా నుంచి వచ్చిన శకులు, చైనా నుంచి వచ్చిన కుషానులు వంటి వారు పాలకులుగా భారత దేశానికి రావడానికి ముందే అఫ్గనిస్తాన్‌ను ఓడించి, మరీ వచ్చేవారు. నేటి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్కు చెందిన బాబర్ కూడా మొదట కాబూల్‌ను జయించి, అక్కణ్నుంచే ఇండియాకు వచ్చాడు. అంతకుముందు ఆఫ్గన్లే మన దేశంపై దండెత్తి జయించారు.
క్రీ.శ. 1186లో షహాబుద్దీన్ (మొహమ్మద్) ఘోరీ ఘజనీ నుంచి, లాహోర్ (అవిభక్త భారతదేశంలో ముఖ్యపట్టణం) జయించి, అక్కణ్నుంచి దిల్లీ పాలకుడైన పృథ్వీరాజ్ చౌహాన్పైకి 1191లో దండెత్తాడు. ఆ సారికి ఓడిపోయినా, తర్వాతి సంవత్సరం పృథ్వీరాజ్‌ను ఓడించాడు. చిన్నప్పుడు మనం చదువుకున్న సంయుక్త స్వయంవరం, ఆమె తండ్రి జయచంద్రుడు అల్లుణ్ని ఘోరీకి పట్టివ్వడం కథలకు చారిత్రక ఆధారం లేదట! 1192 నుంచే మన దేశంలో ముస్లిం పాలన ప్రారంభమైంది. అప్పటిదాకా కొందరు వచ్చి దోచుకుని వెళ్లిపోయారు తప్ప నిలిచి రాజ్యం చేయలేదు. ఇతను మాత్రం 1206 వరకు పాలించాడు. అతని తర్వాతి అతని బానిస కుతుబుద్దీన్ ఐబక్ (పాలనాకాలం 1206-10) దిల్లీని పాలించాడు. అక్కణ్నుంచి 150 సంవత్సరాలలో ముస్లిం పాలకులు ఉత్తర భారతాన్ని గెలుస్తూ పోయారు. అప్పుడు అక్కడివారు దక్షిణాదికి తరలి వచ్చేశారు. క్రమేపీ ముస్లిం పాలన దక్షిణాదికి కూడా వ్యాపించింది. ఆ చరిత్ర యిప్పుడక్కరలేదు.
ముస్లిం పాలన అనేది ఒక పేరే కానీ, ముస్లింలు వచ్చి హిందూ రాజులను జయించారని అర్థం కాదు. ఎందుకంటే చాలా యుద్ధాల్లో నెగ్గినవారూ ముస్లిములే, ఓడినవారూ ముస్లిములే! ముస్లిం లేదా హిందూ రాజుల సైనికుల్లో ముస్లిములు, హిందువులు అందరూ వుండేవారు. విశ్వాసపాత్రత ఒక్కటే కొలబద్ద, ఒకే మతం అవునా కాదా అని చూసేవారు కాదు. అంతెందుకు మనమందరం అసహ్యించుకునే ఘజనీ మొహమ్మద్ (971-1030) ఉన్నాడు కదా! అతనూ ఆఫ్గనే. అనేక గుళ్లు నాశనం చేసి కాఫిర్ల విగ్రహాలను ధ్వంసం చేశానని గొప్పగా చెప్పుకునేవాడు. కానీ అతని సైన్యంలో హిందూ సైన్యదళం విడిగా వుండేది. దానికి జనరల్‌గా తిళక్ అనే హిందువు వుండేవాడు. గజనీ యిక్కడ వుండగా అఫ్గనిస్తాన్‌లో తిరుగుబాటు చెలరేగితే తిళక్ దళాన్ని గజనీ తీసుకెళ్లి వాళ్లని ఓడించాడు. అంటే హిందువుల చేత ముస్లిములను చంపించాడన్నమాట. రాజుల పాలన అంటే యిలాగే వుంటుంది.
ఆఫ్గన్లకు అశ్వబలం బాగా వుంది. భారతీయులు తమ యుద్ధతంత్రంలో పాతకాలం పద్ధతులు ఉపయోగించేవారు. ఏనుగులెక్కి యుద్ధాలు చేసేవారు. భారతీయ సుల్తానులు తమ సైన్యంలో ఆఫ్గన్ దళాలను పోషించేవారు. వారి ద్వారా అఫ్గనిస్తాన్‌పై దండెత్తేవారు. అప్పట్లో పర్షియా, మొఘల్ సామ్రాజ్యాల మధ్య నలిగింది. కొంతకాలం మొఘల్ పాలకుల క్రిందే వుంది. మరి కొంతకాలం పర్షియన్ పాలకుల కింద వుండి, వారిపై తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యం తెచ్చుకుని తన బతుకు తను బతకసాగింది. ఇంగ్లీషు వాళ్లు వచ్చి ఈస్టిండియా కంపెనీ ద్వారా ఇండియాను ఆక్రమించడం మొదలుపెట్టాక, పర్షియా బలం క్రమేపీ తగ్గింది అమ్మయ్య అని ఆఫ్గన్లు అనుకునే రోజుల్లో యిక ఇంగ్లండ్, రష్యా సామ్రాజ్యాల మధ్య నలిగింది. ఇంగ్లండ్‌ను రాణి పాలిస్తోంది, రష్యాను జార్ చక్రవర్తులు పాలిస్తున్నారు. అఫ్గనిస్తాన్ ఉత్తరాన ఉన్న రాజ్యాలన్నీ రష్యా అధీనంలో వున్నాయి. తూర్పు, దక్షిణ సరిహద్దులలో బ్రిటిషు పాలనలో వున్న అవిభక్త భారతం ఉంది.
అఫ్గనిస్తాన్ తన సరుకులను అమ్ముకోవాలంటే దగ్గరగా వున్న రేవు పట్టణం బ్రిటిషు ఇండియాలోనే (ఇప్పటి పాకిస్తాన్ భాగం) వుంది. అందువలన వారితో సఖ్యంగానే వుండేది. కానీ బ్రిటిషు (అప్పట్లో ఈస్టిండియా కంపెనీయే ఇండియాను పాలించేది) వాళ్లకు అనుమానం, రష్యన్ చక్రవర్తులు అఫ్గనిస్తాన్ ద్వారా తమపై దాడి చేస్తారేమోనని. నిజానికి రష్యన్ చక్రవర్తులెవరికీ అలాటి ఉద్దేశం లేదు. వాళ్ల దృష్టంతా యూరోప్ మీదే. అయినా ఆ సాకు చెప్పి రష్యా కంటె ముందే అఫ్గనిస్తాన్‌ను మన ఏలుబడిలోకి తెచ్చుకుందామని అనుకుంది ఈస్టిండియా కంపెనీ. 1831లో అలెగ్జాండర్ బర్న్స్ అనే ఒకతన్ని పంపి వివరాలు సేకరించమంది. అతను స్థానికుల భాష నేర్చుకుని, వారి మధ్య వుంటూ వాళ్ల జీవనశైలి గమనించి, గుట్టుమట్లన్నీ పుస్తకంగా రాసి అందించాడు. ఇంకేముంది మన జయించేయవచ్చు అనుకుంటూ 1839లో ఉత్తిపుణ్యానికే అఫ్గనిస్తాన్‌పై దండెత్తారు.
వీళ్లది సుశిక్షితులైన సైనికులతో కూడిన దళం. వాళ్లది మోటు గిరిజన యుద్ధరీతి. వీళ్లు వెళ్లి అక్కడ మకాం వేసి కూర్చున్నారు. అఫ్గన్లు సరేలే అని ఊరుకున్నారు. ఆంగ్లేయులు కొంతకాలానికి స్థానికమహిళలతో వ్యవహారాలు మొదలెట్టారు. అది ఆఫ్గన్లను మండించిది. వీళ్ల దళాలపై దాడి చేసి, చంపడం మొదలెట్టారు. 19 వేల మంది వెళితే ఒకే ఒక్కడు మిగిలాడు. ఈస్టిండియాకు అహం పొడుచుకుని వచ్చి, మరిన్ని దళాలను పంపింది. వాళ్లదీ అదే గతి. ఇక అక్కణ్నుంచి కుతంత్రాలు మొదలుపెట్టారు. అఫ్గన్ పాలకుల మధ్య విభేదాలు సృష్టించి, వారిలో ఒకరిని లోబరుచుకుని, పంజాబ్‌ను భాగస్వామిగా చేసుకుని, మూడేళ్లపాటు యుద్ధాలు చేసి చివరకు 1842లో కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆ నగరాన్ని ధ్వంసం చేశారు. దోచుకుని, దగ్ధం చేశారు. విదేశీపాలన అంటే అస్సలు పడని ఆఫ్గన్లు అనేకచోట్ల తిరుగుబాటులు లేవదీశారు. ఎక్కడికెక్కడ ఎదిరించారు. వీళ్లను అదుపులో వుంచడం కష్టమనుకున్న బ్రిటన్లు వెనక్కి తగ్గి, మళ్లీ తెరవెనుక రాజకీయాలకు తెరతీశారు.
1878లో అమీర్ (అఫ్గన్ పాలకుడు) అయినతను రష్యాతో సన్నిహితంగా వుండడం చూసి, ఓర్చుకోలేక మళ్లీ యింకో యుద్ధం చేశారు కానీ గెలవలేక పోయారు. వెనక్కి తగ్గి, అమీర్‌తో ‘మా ఏలుబడిలో వుండనక్కరలేదు. నీకు ఏటా డబ్బిస్తూ వుంటాం. నువ్వు ఏ యితర దేశంతోను సంబంధాలు పెట్టుకోకూడదు.’ అని బేరమాడారు. అలా కొంతకాలం గడిచింది. 1880లో రాజ్యానికి వచ్చి 21 ఏళ్లు పాలించిన అమీర్ అబ్దుర్ రహమాన్ బ్రిటన్‌తో సన్నిహితంగానే వున్నాడు. అతని తర్వాత 1901లో రాజ్యానికి వచ్చిన అమీర్ హబీబుల్లా కూడా బ్రిటన్‌కు ఆప్తుడే. 1919లో అతని తర్వాత అతని పెద్దకొడుకు ఇనాయతుల్లా రాజవుతా డనుకునేవారు. కానీ మూడో కొడుకు అమానుల్లాకు సింహాసనంపై కన్నుంది. 1919 ఫిబ్రవరిలో తండ్రి వేటకి వెళ్లినపుడు గుడారంలో వుండగా అతని సేవకుడి చేతే చంపించివేశాడు. లెక్క ప్రకారం వారసుడిగా హబీబుల్లా తమ్ముడు నస్రుల్లా రాజు కావాలి. అతను ‘నాకు సింహాసనం అక్కరలేదు, ఇనాయత్‌ను కూర్చోబెట్టండి.’ అన్నాడు. కాదు, నువ్వే కూర్చోవాలి అని చెప్పి రాజును చేసి వారం రోజుల తర్వాత అతన్ని పదవీభ్రష్టుణ్ని చేసి తనే రాజైపోయాడు అమానుల్లా. ఆ తర్వాత ఒక బూటకపు విచారణ జరిపి, తండ్రి హత్యలో బాబాయి హస్తం వుందని నిరూపించి, యావజ్జీవ ఖైదు పడేట్లా చేశాడు. ఓ ఏడాది పోయిన తర్వాత జైల్లోనే హత్య చేయించాడు. తర్వాతి చరిత్ర అఫ్గన్ సంస్కరణవాదిని తప్పించిన బ్రిటన్ అనే వ్యాసంలో (చిత్రం మొదటి ఆంగ్లో-ఆఫ్గన్ యుద్ధం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)