రోశయ్య గారి అల్లుడికి కీలక‌ పదవి

కాంగ్రెస్ దిగ్గజ నేత కొణిజేటి రోశయ్య అంటే తెలియని తెలుగు జనాలు ఎవరూ ఉండరు. ఆయన వైఎస్సార్ మరణాంతరం ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. ఇదిలా ఉంటే రోశయ్య అల్లుడుగానే కాకుండా ప్రముఖ…

కాంగ్రెస్ దిగ్గజ నేత కొణిజేటి రోశయ్య అంటే తెలియని తెలుగు జనాలు ఎవరూ ఉండరు. ఆయన వైఎస్సార్ మరణాంతరం ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. ఇదిలా ఉంటే రోశయ్య అల్లుడుగానే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తగా, విద్యా సంస్థల అధినేతగా పైడా క్రిష్ణ ప్రసాద్ కి విశాఖలో ఘనమైన  పేరుంది.

ఆయనలో ఆధ్యాత్మిక భావనలు కూడా మెండు. విశాఖలో శరణ్య వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని విశాఖలో  ఆయన ఏర్పాటు చేసి భక్త జనుల మన్ననలు అందుకున్నారు. అటువంటి క్రిష్ణ ప్రసాద్ ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా జగన్ ప్రభుత్వం తాజాగా  నియమించింది. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి ఎంపిక అని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే విశాఖకు రాజధాని కనుక వస్తే క్రిష్ణ ప్రసాద్ కి చెందిన విద్యా సంస్థల భవనాలను కూడా వాడుకుంటారు అన్న ప్రచారం ఒక వైపు ఉంది. ఇపుడు ఈ కీలకమైన  పదవి ఇవ్వడంతో ఆయన సహకారం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఉంటుంది అని తెలుస్తోంది. 

మొత్తం మీద విశాఖ సిటీకి టీటీడీలో రెండు పదవులు దక్కాయి. అందులో మరొకటి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ అయిన సుధాకర్ కి ఇచ్చారు. వీరికి ఈ పదవులు రావడం పట్ల ఆధ్యాత్మికపరులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.