“ఈ ఉద్యోగం గోవిందుడు కల్పించిన సేవా భాగ్యం” అనే స్ఫూర్తిదాయక వాక్యాలు టీటీడీ కార్యాలయాల్లో కనిపిస్తాయి. కానీ కొందరి పాలిట టీటీడీలో ఉద్యోగం వెట్టిచాకిరిని తలపిస్తోంది. ముఖ్యంగా టీటీడీ విద్యా సంస్థల్లో పనిచేసే గురువులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరహం సేవాతత్పరతతో పని చేసే గురువుల సమస్యలను పట్టించుకునే అధికారే కరువయ్యారు. ఇక వాళ్లకు దేవుడే దిక్కయ్యారు. గట్టిగా 100 మంది గురువుల సమస్యలను పరిష్కరించే మనసు కరువైంది. ఎందుకంటే వాళ్లను మనుషులుగా గుర్తించే మనిషి, మనసు భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు.
తిరుపతి, తిరుమలలో టీటీడీ తరపున 8 ఉన్నత పాఠశాలలున్నాయి. తిరుమలలో ఒకటి మినహా మిగిలివన్నీ తిరుపతిలో ఉన్నాయి. తిరుపతిలో ప్రభుత్వ పాఠశాల కేవలం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఉందంటే… ఆధ్యాత్మిక క్షేత్రంలో విద్యా కుసుమా లను వికసింపజేయడంలో టీటీడీ ఎంత అద్వితీయమైన పాత్ర పోషిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జగన్ ప్రభుత్వం కూడా విద్యాకు చాలా ప్రాధాన్యం ఇస్తోంది.
నాడు-నేడు అంటూ పాఠశాల్లో వసతులతో పాటు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తోంది. ఇందుకు ఎంత డబ్బు ఖర్చైనా వెనుకాడని పరిస్థితి కళ్లకు కడుతోంది. అయితే టీటీడీలో విద్యాశాఖ అధికారులకు. పర్యవేక్షిస్తున్న బాధ్యులకు మాత్రం ప్రభుత్వ ప్రాధాన్యతలు పట్టడం లేదు.
టీటీడీ విద్యాసంస్థల్లో అత్యంత పేద విద్యార్థులు చదువుతుండడమో లేక తమ పిల్లలు అక్కడ చదవలేదనే నిర్లక్ష్యమో… తెలియదు కానీ టీటీడీ విద్యాసంస్థల సమస్యలను గాలికొదిలేశారు. తిరుపతి, తిరుమలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ 4 వేలకు పైబడి విద్యార్థులకు బోధించేందుకు కేవలం 104 మంది మాత్రమే గురువులున్నారు. అది కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులైన వారు మాత్రమే. వీరిలో అత్యధికులు మహిళా ఉపాధ్యాయులు కావడం విశేషం.
ఎనిమిది పాఠశాలలకు ఏడుగురు ప్రధానోపాధ్యాయులు మినహా, మిగిలిన బోధనా సిబ్బంది అంతా కాంట్రాక్ట్ ప్రాతిపది కనే పని చేస్తుండడం గమనార్హం. 1992లో చివరిసారిగా టీటీడీ విద్యాశాఖలో రిక్రూట్‌మెంట్ జరిగింది. ఆ తర్వాత 2007-08లో దివంగత వైఎస్సార్ హయాంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపిక చేసుకున్న టీచర్సే నేటికీ సేవలందిస్తున్నారు.
టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగమైనా , దేవుని సేవగా భావించి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. కానీ కనీస గుర్తింపుకార్డులకు కూడా నోచుకోని దయనీయ స్థితిలో గురువులున్నారు. గురువుల వల్ల పాఠశాలలు నడవాలి గానీ, వారికి తగిన గుర్తింపు మాత్రం ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ఆలోచించకపోవడం, తల్లితండ్రుల తర్వాత గౌరవం పొందుతున్న ఉపాధ్యాయులపై వారి లెక్కలేని తనాన్ని చూడొచ్చు. ఒకవేళ అనారోగ్యం పాలైనా టీటీడీ కల్సించే ఉచిత వైద్య సౌకర్యానికి నోచు కోవడం లేదు.
ఈ నేపథ్యంలో అరకొర వచ్చే జీతంలోనే రోగాలకు ఖర్చు చేయాల్సిన దుస్థితి. అలాగే సిబ్బంది కొరతతో ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రాణం మీదకు వస్తే తప్ప సెలవు దొరకని దుస్థితి. అది కూడా ప్రధానోపాధ్యాయుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంటుంది. ఇక టీఏలు, డీఏల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరోవైపు ప్రతి ఏడాది రెన్యు వల్ సమయం వచ్చే సరికి …అదో పెద్ద ప్రహసనంగా తయారైందనే ఆవేదన గురువుల్లో వ్యక్తమవుతోంది.
అకడమిక్ ఇయర్ ప్రారంభమైన వెంటనే జూన్‌లో గురువులంతా విధుల్లో చేరుతారు. కానీ ఒక వైపు విధులు నిర్వహిస్తూనే, మరోవైపు రెన్యువల్ అవుతుందో, లేదోననే ఆందోళన మధ్య విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన దయనీయ స్థితి. అది కూడా ఆగస్టు, సెప్టెంబర్ వరకూ జీతాలకు నోచుకోకుండా ఎదురు చూడాల్సిన పరిస్థితి పగవారికి కూడా వద్దనేలా ఉందనే ఆవేదన ఉపాధ్యాయుల్లో కనిపిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని గత ఎన్నికల ముంగిట వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతో …ఎన్ని ఇబ్బందులున్నా భవిష్యత్‌పై భరోసాతో టీటీడీలో పని చేస్తున్న ఇతర శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల మాదిరిగానే ఉపాధ్యాయులు కూడా ముందుకెళుతున్నారు.
టీటీడీలో విద్యాశాఖ అధికారులు, తిరుపతి జేఈఓ మాత్రం మూడు ప్రొటోకాల్ దర్శనాలు, ఆరు అంకెల జీతం అన్న రీతిలో పవర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతే తప్ప, మానవసేవే మాధవ సేవ అనే స్ఫూర్తి వారిలో కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ అనేది అన్నార్థుల పాలిట ఆపద్భందువే తప్ప, లగ్జరీ అనుభవించడానికి ఎంత మాత్రం కాదు. శ్రీవారికి సేవ చేసే భాగ్యమంటే.. ఏడుకొండల వాడి స్ఫూర్తిని ఆచరించడం. అంటే పేద పిల్లలకు మెరుగైన విద్య అందించే వసతులు కల్పించడం.
చిన్నారుల జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దే గురువుల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేయడం. ఒక్కసారి మన పిల్లల్ని టీటీడీ విద్యాసంస్థల్లో చదివిస్తున్నామని, అలాగే ఆ కాంట్రాక్ట్ గురువుల్లో తాము ఒకరైతే ఎలా వుంటుందో ఊహించుకుంటే… అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇందుకు కావాల్సిందల్లా మనుషుల్ని ప్రేమించే నిండైన మనసు. తిరుమల శ్రీవారి ఆకాంక్షలకు విరుద్ధంగా టీటీడీలో విధుల నిర్వహణ అంటే…అది అపచారం అని హెచ్చరించక తప్పదు.