మంచి న‌టులు కూడా అంత బాగా న‌టించ‌లేరేమో!

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ మ‌న‌సులో ఏది వుంటే అదే బ‌య‌టికి మాట్లాడ్తారు. రాజ‌కీయాల్లో ఆయ‌నో బోలా మ‌నిషి. కాక‌పోతే చంద్ర‌బాబునాయుడిపై అప్పుడ‌ప్పుడు “క‌మ్మ‌”ని ప్రేమ ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ప‌ది తిట్లు…

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ మ‌న‌సులో ఏది వుంటే అదే బ‌య‌టికి మాట్లాడ్తారు. రాజ‌కీయాల్లో ఆయ‌నో బోలా మ‌నిషి. కాక‌పోతే చంద్ర‌బాబునాయుడిపై అప్పుడ‌ప్పుడు “క‌మ్మ‌”ని ప్రేమ ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ప‌ది తిట్లు తిడితే, చంద్ర‌బాబు ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి ఒక‌ట్రెండు విమ‌ర్శ‌ల‌తో స‌రిపెడుతుంటారు. అందుకే ఆయ‌న్ను ప్ర‌త్య‌ర్థులు ముద్దుగా క‌మ్మ‌నిస్టు అని విమ‌ర్శిస్తుంటారు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో సీపీఐకి పొత్తు కుదిరింది. సీపీఎం మాత్రం ఒంట‌రిగా బ‌రిలో దిగింది. సీపీఐ, సీపీఎం పునాదులు క‌మ్యూనిజ‌మే అయినా, సిద్ధాంతాల‌ను విస్మ‌రించిన పార్టీలుగా చాలా కాలం క్రిత‌మే చెడ్డ‌పేరు మూట‌క‌ట్టుకున్నాయి. బూర్జువా పార్టీల‌ని ఒక‌వైపు తీవ్రంగా విమ‌ర్శిస్తూ, మ‌ళ్లీ ఒక‌ట్రెండు సీట్ల కోసం ఆ పార్టీల తోక ప‌ట్టుకుని ఎన్నిక‌ల గోదాలో ఈద‌డంతో ప్ర‌జ‌ల తిరస్క‌ర‌ణ‌కు గురి అవుతున్నాయి. అంతిమంగా లౌకిక పార్టీల‌తోనే త‌మ ప్ర‌యాణం అని వామ‌ప‌క్ష పార్టీలు తేల్చి చెప్ప‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో మ‌త‌త‌త్వ పార్టీ బీజేపీపై సీపీఐ జాతీయ నాయ‌కుడు కె.నారాయ‌ణ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సానుకూల‌మ‌ని ప్ర‌ధాని మోదీ అన‌డం ప‌చ్చి ద‌గా అని విమ‌ర్శించారు. గ‌తంలో ఇదే విష‌య‌మై ప్ర‌ధాని మోదీని క‌లిసేందుకు మంద‌కృష్ణ మాదిగ చాలాసార్లు ప్ర‌య‌త్నించార‌ని గుర్తు చేశారు. కానీ ప్ర‌ధాని అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు.

అలాంటిది ఇప్పుడే మంద‌కృష్ణ మాదిగ‌ను ప్ర‌ధాని ఎందుకు క‌లిశార‌ని నారాయ‌ణ ప్ర‌శ్నించారు. స‌భా వేదిక‌పై ప్ర‌ధాని మోదీ ఎందుక‌న్ని డ్రామాలు ఆడార‌ని నారాయ‌ణ నిల‌దీశారు. మంచిన‌టులు కూడా అంత బాగా న‌టించ‌రేమో అని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ వెట‌క‌రించారు. బీజేపీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా తెలంగాణ‌లో ఒక్క సీటు కూడా రాద‌న్నారు.

ఇటీవ‌ల మాదిగ‌ల విశ్వ‌రూప స‌భ‌లో ప్ర‌ధాని మోదీని ప‌ట్టుకుని మంద‌కృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. మూడు ద‌శాబ్దాలుగా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు పోరాడుతున్న మంద‌కృష్ణ మాదిగ ఆశ‌యాన్ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. దీంతో మంద‌కృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి గురి కావ‌డం, ఆయ‌న్ను ప్ర‌ధాని ఊర‌డించ‌డంపై నారాయ‌ణ సెటైర్స్ విసిరారు.