మార్నింగ్ అమరావతి, ఆ వెంటనే బంగళూరు, మధ్యాహ్నానికి కలకత్తా, సాయంత్రానికి ఢీల్లీ, రాత్రికి చెన్నయ్. ఇలా తెగ తిరిగేసారు చంద్రబాబు ఎన్నికలకు ముందు. తానే అసలు సిసలు జాతీయ నాయకుడిని అని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేది తనే అని తెగ హల్ చల్ చేసారు. ఇక మోడీని ఇంటికి పంపేయడమే తరవాయి అన్నట్లు హడావుడి చూపించేసారు. ఇక బాబుగారి అనుకూల మీడియా సంగతి, దాని కవరేజ్ సంగతి చెప్పనక్కరలేదు. పైగా 2014లో అధికారంలోకి వచ్చినపుడు తమది జాతీయఫార్టీ అని చెప్పడానికి తెగ తాపత్రయ పడ్డారు.
కట్ చేస్తే..
2019 ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో దారుణ పరాజయం పొందారు. కేంద్రలో మోడీ అఖండ విజయం సాధించారు. అంతే చంద్రబాబుకు జ్ఞానోదయం అయింది. మోడీని కొట్టే మగాడు ఇప్పట్లో లేడు అని అర్థం అయింది. మోడీకి దూరంకావడం వల్లనే ఆంధ్రలో అధికారం పోయిందని కూడా క్లారిటీ వచ్చింది. దాంతో మళ్లీ ఎప్పటికైనా తమకు మోడీతో పొత్తు అత్యవసరం అని తెలిసి వచ్చింది. అంతే ఇక జాతీయ రాజకీయాలకు స్వస్థి చెప్పేసారు.
తనే మీకు పెద్దదిక్కు అన్నట్లుగా పట్టుకున్న కాంగ్రెస్ ను గాలికి వదిలేసారు. ప్రతిపక్షనేతలను మరిచారు. అసలు జాతీయ రాజకీయాలను, సంఘటనలను పట్టించుకోవడం లేదు. అస్సలు కామెంట్ చేయడానికే ధైర్యం చేయడంలేదు. బ్యాంకులను విలీనం చేస్తున్నారు. తెలుగువారి ఏకైక బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ను విలీనం చేస్తున్నారు. ఇక ఆంధ్రాబ్యాంక్ అన్నది వుండదు. ఈ విషయమై సెంటిమెంట్ కాస్త కనిపిస్తోంది. కనీసం ఓ మాట కూడా మాట్లాడలేదు బాబుగారు కానీ, ఆయన కొడుకు లోకేష్ బాబు కానీ. చిన్న ట్వీటు కూడా లేదు.
చిదంబరం కేసే తీసుకోండి. ఈడీ గురించి కానీ, దాని వైఖరి గురించి కానీ అస్సలు మాటలేదు. అదే సుజనచౌదరి మీదకు వచ్చినపుడు, సిఎమ్ రమేష్ మీదకు ఐటి వచ్చినపుడు మాత్రం తెగ రెచ్చిపోయారు. ఇప్పుడు మాత్రం మాటలేదు. ఇంకా అనేకానే జాతీయాంశాలు వున్నాయి. కానీ బాబు కానీ చినబాబు కానీ చిన్న కామెంట్ కూడా చేయడంలేదు. పార్టీ వైఖరి చెప్పడంలేదు. మరి జాతీయ పార్టీ ఎలా అవుతుంది?
తెలంగాణలో గుళ్లలో కేసిఆర్ విగ్రహం వ్యవహారం రచ్చకెక్కింది. దీని మీద కూడా చంద్రబాబు కామెంట్ లేదు. మొత్తానికి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇప్పుడు జగన్ మీద తప్ప మరెవరి మీదా కామెంట్ చేయడం కానీ, ఒపీనియన్ చెప్పడం కానీ చేసే పరిస్థితిలో లేరు. మోడీని ఏమంటే ఏమవుతుందో? కేసిఆర్ ను కామెంట్ చేస్తే ఏమవుతుందో? ఇదీ ఇద్దరు బాబుల పరిస్థితి.