టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుకు భారత్ 169 పరుగుల టార్గెట్ పెట్టింది. అడిలైడ్‌లో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతోంది. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. తాజా సెమీ ఫైనల్లో గెలిచే జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఇవాళ ఇంగ్లండ్‌తో ఆడుతున్న మ్యాచ్‌లో మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ఫోర్‌తో ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత నెమ్మదిగా సాగింది. 9 పరుగులకే మొదటి వికెట్ పడింది. విరాట్‌కోహ్లీ 50, హార్దిక్ పాండ్యా 63 పరుగులు చేసి, ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్‌ను సాధించగలిగారు.
హార్దిక్ పాండ్యా సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఇండియా స్కోర్ పరుగు తీసింది. పది ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ జట్టు రెండు వికెట్లు నష్టపోయి 62 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత మిగిలిన పది ఓవర్లలో 106 పరుగులు చేసింది. దీన్నిబట్టి కోహ్లి, హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ బౌలర్లపై ఎలా విరుచుకుపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
భారతీయ క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ ఇవాళ్టి రోజు సరిగా రాణించలేకపోయారు. 14 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇదిలా వుండగా జోర్డాన్ వేసిన చివరి ఓవర్లో చివరి బంతిని హార్దిక్ బౌండరీ దాటించినప్పటికీ నిరాశే ఎదురైంది. హార్దిక్ కాలు వికెట్లకు తగలడంతో హిట్ వికెట్ కింద ఆయన ఔట్ అయ్యారు. దీంతో బంతి బౌండరీ దాటినప్పటికీ 168 పరుగులకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ స్కోర్ భారత్‌ను ఫైనల్‌కు చేరుస్తుందా? లేదా? అనేది కాసేపట్లో తేలనుంది.