టీ 20 వరల్డ్ కప్‌లో కీలక మ్యాచ్‌లో రోహిత్ సేన చేతులెత్తేసింది. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ విఫలమై భారత్ క్రికెట్ క్రీడాభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. అత్యంత పేలవమైన ఆటతీరుతో భారత్ క్రికెట్ జట్టు తీవ్ర విమర్శలపాలవుతోంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరుగైన ఆటతీరు కనబరిచిన ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు చేరడం విశేషం.
ఆడిలైడ్‌లో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట బౌలింగ్‌ను ఎంచుకుంది. భారత్ ఓపెనర్లలో కేఎల్ రాహుల్ 5, రోహిత్ 27 పరుగులు చేయడం గమనార్హం. విరాట్ కోహ్లీ 50, హార్దిక్ పాండ్యా 63 పరుగులతో ఆకట్టుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ 14, రిషబ్ పంత్ 6 పరుగులతో ప్లాప్ షో ప్రదర్శించారు.
169 పరుగుల విజయ లక్ష్యంతో ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ మైదానంలో అడుగు పెట్టారు. మొదటి బాల్ నుంచి భారత్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. బౌలర్లను తరచూ మార్చినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బట్లర్ 80, హేల్స్ 86 పరుగులు చేసి జట్టును విజయ పథాన నడిపించారు. వీళ్లిద్దరూ నాటౌట్‌గా నిలవడం విశేషం. ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది.