ఆ మ‌హ‌నీయుడిపై రాజకీయం చేయొద్దు!

క‌డ‌ప‌లో యోగివేమ‌న విశ్వ విద్యాల‌యంలో వేమ‌న విగ్ర‌హాన్ని తొలగించి దివంగ‌త వైఎస్సార్ విగ్ర‌హాన్ని నెల‌కొల్ప‌డంపై తీవ్ర వివాదం నెల‌కుంది. ఈ వివాదంపై స‌ద‌రు వీసీ ఆచార్య మున‌గాల సూర్య‌క‌ళావ‌తి వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌హ‌నీయుడైన యోగి…

క‌డ‌ప‌లో యోగివేమ‌న విశ్వ విద్యాల‌యంలో వేమ‌న విగ్ర‌హాన్ని తొలగించి దివంగ‌త వైఎస్సార్ విగ్ర‌హాన్ని నెల‌కొల్ప‌డంపై తీవ్ర వివాదం నెల‌కుంది. ఈ వివాదంపై స‌ద‌రు వీసీ ఆచార్య మున‌గాల సూర్య‌క‌ళావ‌తి వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌హ‌నీయుడైన యోగి వేమ‌న విగ్ర‌హంపై రాజ‌కీయం చేయొద్ద‌ని ఆమె అభ్య‌ర్థించారు. వ‌ర్సిటీలో వేమ‌న‌, వైఎస్సార్ విగ్ర‌హాల‌కు సంబంధించిన సాగుతున్న వివాదానికి ఆమె తెర‌దించారు.

వేమ‌న విగ్ర‌హాన్ని తొల‌గించామ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. వేమ‌న‌కు మ‌రింత ప్రాధాన్యం ఇచ్చే క్ర‌మంలో ఆయ‌న విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామ‌ని వీసీ చెప్పుకొచ్చారు. న్యాక్ గ్రేడింగ్‌లో విశ్వ‌విద్యాల‌యం అభివృద్ధిని చూసి “ఎ” గ్రేడ్ ఇచ్చార‌ని ఆనందంతో ఆమె చెప్పారు.

అభివృద్ధి ప‌నుల్లో భాగంగా వేమ‌న విగ్ర‌హాన్ని అడ్మినిస్ట్రేష‌న్ కార్యాల‌యం స‌మీపం నుంచి వ‌ర్సిటీ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌కు త‌ర‌లించామ‌న్నారు. అక్క‌డ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల రోడ్డుపై వెళ్లే ప్ర‌తి ఒక్క‌రూ వేమ‌నను చూస్తూ, ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకునే అవ‌కాశం వుంద‌న్నారు. వేమ‌న పేరుతో ఉన్న కార‌ణంగా ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద విగ్ర‌హాన్ని ఏర్పాటు చేప్తే బాగుంటుంద‌ని అంద‌రితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా వేమ‌న విగ్ర‌హాన్ని మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశామ‌న్నారు. పీజీ సెంట‌ర్‌ను యూనివ‌ర్సిటీగా అభివృద్ధి చేసిన దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ విగ్ర‌హాన్ని వేమ‌న విగ్ర‌హం ఉన్న స్థ‌లంలో ఏర్పాటు చేసిన‌ట్టు ఆమె వివ‌ర‌ణ ఇచ్చారు. 

వేమ‌న‌, వైఎస్సార్ విగ్ర‌హాల మార్పే త‌ప్ప‌, కొత్త‌గా ఏర్పాటు చేసిన‌వి కావ‌ని ఆమె స్ప‌ష్ట‌త ఇచ్చారు. ప‌రిపాల‌న భ‌వ‌నానికి వైఎస్సార్ పేరు పెట్టిన కార‌ణంగా అక్క‌డ ఆయ‌న విగ్ర‌హాన్ని నెల‌కొల్పిన‌ట్టు ఆమె వెల్ల‌డించారు. ఇందులో వివాదానికి ఆస్కారం లేద‌ని వీసీ వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే వ‌ర్సిటీ అధికారుల స‌మాచారం లోపం వ‌ల్లే విగ్ర‌హాల ఏర్పాటుపై ర‌గ‌డ చోటు చేసుకుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.