బాలయ్య, బాహుబలిపై కూడా కేసులు పెట్టగలరా?

బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లను కూడా విచారిస్తారా? లేదా.. లైట్ తీసుకుని యాప్ నిర్వాహకుల మీదికి మాత్రం వెళతారా అనేది ఆసక్తికరమే.

బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించినంత వరకు ఇప్పటిదాకా అంతా చిన్న చేపల చుట్టూతానే వివాదం నడుస్తోంది. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ప్రకటనలు చేశారనే కారణంగా పోలీసులు నోటీసులు ఇచ్చిన వారిలో ప్రకాష్ రాజ్, రానాలే అతిపెద్ద సెలబ్రిటీలు. మిగిలిన వారంతా చిన్నా సన్నా నటులు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రమే. అయితే.. ఇప్పుడు తొలిసారిగా పెద్ద చేపల పేర్లు బయటకు వస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ తదితరులు కూడా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ప్రకటనలు చేశారని న్యాయవాది ఇమ్మనేని రామారావు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు.. ఈ అగ్రహీరోలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? లేదా, ఇప్పటికే నోటీసుల అందుకున్న వారిమీద కేసులే నీరుగారుతున్న తరుణంలో.. వీరి పట్ల ఉపేక్ష వహిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది.

చైనీస్ బెట్టింగ్ యాప్ అయిన ఫన్-88 ను ప్రమోట్ చేయడానికి సినీనటులు నందమూరి బాలకృష్ణ, ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు (ప్రభాస్), తొట్టెంపూడి గోపీచంద్ ప్రకటనలు చేశారని న్యాయవాది ఆన్ లైన్ లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు- ఇతరుల ఆధార్ నెంబర్లతో వారికి తెలియకుండానే తీసుకునే మ్యూల్ ఖాతాల ద్వారా కోట్లాది రూపాయలు చైనాకు తరలించినట్టుగా ఆ ఫిర్యాదులో వివరించారు.

ఫన్ 88 బెట్టింగ్ యాప్ ఇంకా గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోనే ఉన్నదని.. దానిన వెంటనే బ్లాక్ చేయించాలని రామారావు కోరుతున్నారు. అయితే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారికి నోటీసులు ఇచ్చే ముందు భిన్న కోణాల్లో దర్యాప్తు చేయాలంటూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు పైనుంచి ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణలో బెట్టింగ్ యాప్ లకు అడ్డుకట్ట వేయడానికి చట్టంలో మార్పులు చేస్తున్నారు. కేవలం ప్రమోట్ చేసిన వారిమీద కేసులు పెట్టి కట్టడి చేయడమే కాకుండా.. ఈ యాప్ ల నిర్వాహకుల మీద గట్టి కేసులు నమోదు చేసి.. కఠినశిక్షలు అమలు చేసేందుకు చట్టపరంగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నవారందరినీ విచారించారు కదా.. మరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ లను కూడా విచారిస్తారా? లేదా.. లైట్ తీసుకుని యాప్ నిర్వాహకుల మీదికి మాత్రం వెళతారా అనేది ఆసక్తికరమే.

3 Replies to “బాలయ్య, బాహుబలిపై కూడా కేసులు పెట్టగలరా?”

Comments are closed.