తెలంగాణ సర్కార్‌కు ఇబ్బంది తప్పింది. హైకోర్టు కాదన్నప్పటికీ, సుప్రీంకోర్టులో సానుకూల తీర్పుతో కేసీఆర్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్టు ఆదేశాలతో ప్రతిష్టంభన నెలకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వ విజ్ఞప్తులు హైకోర్టులో పనిచేయలేదు. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాల నిమజ్జనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఈ ఏడాదికే ఇది మినహాయింపు ఇచ్చినట్టు స్పష్టం చెప్పడం గమనార్హం.
విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఇది కొత్తగా వస్తున్న సమస్య కాదన్నారు. చాలా ఏళ్లుగా ఈ సమస్య పట్టి పీడిస్తోందన్నారు. అయితే సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఇదే చివరి అవకాశమని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం. సుందరీకరణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం వల్ల ఆ నిధులు వృథా అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తుందో, లేదో చూడాలి.