కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయాన్ని హత్యాచారానికి గురైన సైదాబాద్ బాధిత బాలిక కుటుంబం తిరస్కరించింది. వినాయక చవితి నాడు ఆరేళ్ల చిన్నారిపై మానవ మృగం పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడడంతో పాటు హత్య చేయడం తెలుగు సమాజాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో బాధిత బాలిక కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ గురువారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ.20 లక్షల చెక్కును బాలిక కుటుంబ సభ్యులకు అందజేశారు. అయితే బిడ్డను పోగొట్టుకున్న తమకు లక్షలు అవసరం లేదని , ఆ చెక్కును తిరస్కరించడం గమనార్హం. మంత్రులు ఇచ్చిన చెక్కును తిరిగి ఇచ్చేస్తామని బాలిక కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మంత్రులు తమ ఇంట్లో చెక్కును పెట్టి వెళ్లిపోయారని బాలిక తండ్రి తెలిపాడు. తమకు చెక్కు కాదు.. న్యాయం కావాలని ఆయన డిమాండ్ చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన రూ.20 లక్షల చెక్కుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పాడు.
మరో రూ.20 లక్షలు అదనంగా ఇచ్చినా అవసరం లేదని బాలిక తండ్రి చెప్పడం సంచలనం కలిగిస్తోంది. ఇదిలా వుండగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన రాజు ఇవాళ ఉదయం ఆత్మహత్యకు పాల్పడడం తెలిసిందే.