నిరాహార దీక్షలే షర్మిల ఆయుధమా?

వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రయాణాన్ని నిరాహార దీక్షలతోనే ప్రారంభించింది. పార్టీ పేరును ప్రకటించడానికి ముందే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలనే నినాదంతో నిరాహార దీక్ష మొదలుపెట్టింది. మూడు…

వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో తన రాజకీయ ప్రయాణాన్ని నిరాహార దీక్షలతోనే ప్రారంభించింది. పార్టీ పేరును ప్రకటించడానికి ముందే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలనే నినాదంతో నిరాహార దీక్ష మొదలుపెట్టింది. మూడు రోజులు దీక్ష చేస్తానని ప్రకటించి ప్రారంభించినా ప్రభుత్వం దాన్ని మధ్యలోనే భగ్నం చేసింది. లోటస్ పాండ్ లో దీక్షను కొనసాగించింది.

ఆ తరువాత ఇలా కాదని అనుకోని ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేయడం ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల ఊళ్లకు వెళ్లి అక్కడ నిరాహార దీక్షలు చేయడం మొదలుపెట్టింది.

ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చేవరకు ప్రతి మంగళవారం దీక్షలు కొనసాగిస్తానని ప్రకటించింది. కొన్నివారాలు ఇది బాగానే సాగింది. ఈ దీక్షలకు జనం నుంచి భారీగా స్పందన లేకపోయినా అదేమీ పట్టించుకోకుండా షర్మిల దీక్షలు కొనసాగించింది.

కానీ ఆ తరువాత చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలవారు దీక్ష కోసం తమ ఊరికి రావొద్దని, వచ్చినా తమ ఇంటి దగ్గర దీక్ష చేయొద్దని చెప్పారు. దీంతో షర్మిలకు షాక్ తగిలింది. 

సరే …యూనివర్సిటీలు ఉన్న ఊళ్లలో నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించుకొని కాకతీయ యూనివర్సిటీ ఉన్న వరంగల్ లో దీక్ష చేసింది. ఎన్ని దీక్షలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వాలంటే సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ చెప్పారు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా హమాలీ పనులు చేసుకుంటే మంచిదని లేదా ఉపాధి హామీ పథకం పనులు చేసుకోవాలని మరో మంత్రి కామెంట్ చేశాడు. ఇక ఇప్పుడు షర్మిలకు నిరాహార దీక్ష చేయడానికి మరో సమస్య దొరికింది. 

హైదరాబాద్ సింగరేణి కాలనీలో కొన్నిరోజుల కిందట రాజు అనే యువకుడు ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే కదా వాడిని ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. వాడి ఆచూకీ తెలిపినవారికి పది లక్షలు ఇస్తామని ప్రకటించారు. 

ఇప్పుడు రాష్ట్రంలో ఇది చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రజలూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హత్యాచారానికి గురైన పాప ఇంటికి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఈ ఇష్యూ ద్వారా పొలిటికల్ మైలేజ్ వస్తుందని షర్మిల భావించింది.

ఆ కుటుంబాన్ని పరామర్శించింది. రాజును పట్టుకొని , వాడికి శిక్ష విధించి ఆ కుటుంబానికి న్యాయం చేసేవరకు తాను ఇక్కడే (ఆ ఇంటి ముందు ) నిరాహార దీక్ష చేస్తానని కూర్చుంది. ఆ కుటుంబానికి పరిహారంగా పది కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆమె చెప్పిన ప్రకారం రాజును పట్టుకునేదాకా షర్మిల దీక్ష కొనసాగాలి. ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలుసు ?