జగన్ సర్కార్‌కు భారీ విజయం. ఎన్నికల కౌంటింగ్‌పై సానుకూల తీర్పుతో మొదటి విజయాన్ని సాధించినట్టైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కాసేపటి క్రితం హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పే పునరావృతం అవుతుందని ఆశించిన ప్రతిపక్ష పార్టీలకు చుక్కెదురైంది.
ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నీలం సాహ్నీ పెండింగ్‌లో ఉన్న ఎన్నికలకు వెళ్లారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏప్రిల్ 1న ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించారు. కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చి ఎన్నికలను నిర్వహించారంటూ కోర్టుకెక్కారు.
ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చారు. అయితే పోలింగ్ తేదీకి నాలుగు వారాలకు ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందన్నారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన మరికొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించొద్దని కోర్టు ఆదేశించింది.
ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ మే 21న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం. తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేస్తూ, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్టైంది. ఇక కౌంటింగ్ ప్రక్రియే మిగిలి ఉంది.