కథల ఎంపికలో ఎంత జాగ్రత్తగా వున్నా కానీ కొందరు దర్శకుల విషయంలో మాత్రం అల్లు అర్జున్ అంత స్ట్రెస్ చేయడు. వారి అనుభవంపై నమ్మకం వుంచేసి, వారు చెప్పినట్టు చేసేస్తాడు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అల్లు అర్జున్ మారిపోయాడు. దర్శకుల పూర్వ వైభవం కంటే వాళ్లిప్పుడు రాసిన కథే ముఖ్యమంటున్నాడు.
ఇంతకుముందు కథలు వినకుండానే త్రివిక్రమ్‌తో రెండుసార్లు పని చేసాడు. కానీ 'అల వైకుంఠపురములో' చిత్రానికి త్రివిక్రమ్ ఎనిమిది నెలలు కష్టపడి కథ రాస్తే కానీ షూటింగ్ మొదలు పెట్టలేదు. అలాగే 'ఆర్య' సినిమాతో తనకి హీరోగా బ్రేక్ ఇచ్చిన సుకుమార్ విషయంలో కూడా బన్నీ ఎలాంటి వెసులుబాటు ఇవ్వడంలేదు.
సుకుమార్ గత చిత్రం 'రంగస్థలం' రికార్డులు నెలకొల్పినా కానీ ఇప్పుడు అతనేమి రాసాడనేదే అల్లు అర్జున్ చూస్తున్నాడు. సుకుమార్ ఇప్పటికి నాలుగు వెర్షన్లు రాసినా కానీ అల్లు అర్జున్ ఓకే చెప్పలేదు. ఇంకేదో కావాలంటూ వాయిదా వేస్తున్నాడు. ఈ నెలాఖరులో మరోసారి అల్లు అర్జున్‌ని కలిసి సుకుమార్ కథ వినిపిస్తాడు. అతను ఓకే చేస్తే కనుక దసరాకి సినిమా పూజా కార్యక్రమం మొదలవుతుంది. లేని పక్షంలో వేణు శ్రీరామ్‌తో అనుకుంటోన్న 'ఐకాన్' చిత్రానికి ముహూర్తం ఫిక్స్ అవుతుంది.