ఈడీ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆయన జైలు నుంచి కూడా విడుదలయ్యారు. 101 రోజులకు సంజయ్ రౌత్ జైలు నుంచి బయట అడుగుపెట్టారు. ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీ రీడెవలప్ మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగినట్టుగా, అందులో రౌత్ కు వాటా ఉందంటూ ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన ఈడీ రౌత్ ను కస్టడీలోకి తీసుకుంది.
బీజేపీ-శివసేన పొత్తు వికటించడానికి, మహారాష్ట్ర లో కాంగ్రెస్-ఎన్సీపీతో కలిపి శివసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాటంలో కీలక సూత్ర ధారి అయిన సంజయ్ రౌత్ పై ఈ విధంగా బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందనే ప్రచారం ఉంది.
అదును కోసం చూసిన కేంద్ర ప్రభుత్వం… ఉద్ధవ్, ఏక్ నాథ్ షిండే వర్గాల మధ్య పోరు జరుగుతున్న తరుణంలో రౌత్ ను ఈడీ చేత అరెస్టు చేయించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అప్పట్లో రౌత్ అరెస్ట్ పై ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ ఆయనను చూసి గర్వపడుతున్నామంటూ, రౌత్ నిజమైన సైనికుడంటూ వ్యాఖ్యానించారు.
ఇక ఇప్పుడు రౌత్ బయటికి రావడంతో మహరాష్ట్ర ప్రభుత్వ మనుగడపై ప్రభావం ఉంటుందా? అనే చర్చకు ఆస్కారం ఉంది. లాబీయింగ్ లో సిద్ధహస్తుడుగా పేరు ఉన్న సంజయ్ రౌత్ తన అరెస్ట్ తర్వాత మరింత ప్రతీకారంతో బీజేపీపై వ్యతిరేకంగా పని చేయగలరా? అనేది ప్రశ్నార్థకం.