తన గురించి తను బాగా ఎక్కువగా ఊహించుకునే తత్వం పవన్ కల్యాణ్ ది. ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేసేది ఆయన మాటలే! దీన్నే megalomaniac అంటారని అప్పుడెప్పుడో పవన్ సోదరుడు నాగబాబు చెప్పారు! నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నారో కానీ, ఈ మాట పవన్ కల్యాణ్ కే బాగా సెట్ అవుతుంది.
పవన్ కల్యాణ్ తన స్థాయిని చాలా ఎక్కువగా ఊహించుకుని మాట్లాడిన మాటలు అన్నీ ఇన్నీ కావు. *జగన్ మోహన్ రెడ్డి ఎలా సీఎం అవుతాడో చూస్తా..* అంటూ ఆయన ఒక రేంజ్ ఎమోషన్ తో పలకడం, జగన్ ను సీఎం కానివ్వనంటూ ఆయన ప్రగల్బం పలికిన తీరు ఎవరూ మరిచిపోయేది కాదు. ప్రజాస్వామ్యంలో ఇలా ఎవరైనా మాట్లాడారంటే అంత కన్నా మూర్ఖత్వం మరోటి ఉండదు. పవన్ కల్యాణ్ తీరు అది.
ఇక ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ అలాంటి ఆలోచనలతోనే సతమతం అవుతున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తీరును గమనిస్తుంటే.. తన వీరావేశం తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు ఎవ్వరూ తరలిరావడం లేదనే ఆక్రోశం ఉన్నట్టుంది. వీకెండ్ పాలిటిక్స్ లో పవన్ కల్యాణ్ ఒక రేంజ్ లో హడావుడి చేస్తూ ఉన్నారు.
కులం అంశాన్ని బాగా వాడుతున్నారు. ఆపై అతి ఆవేశం కనబరుస్తూ ఉన్నారు. రచ్చ రచ్చే చేస్తున్నారు. రక్తం పారాలంటున్నారు! ఇక తెలుగుదేశంతో పొత్తు ఖరారయ్యిందనే సందేశాన్నీ ఇస్తూనే ఉన్నారు. మరి ఎన్నికలేమో మరెంతో దూరం లేవు. సరిగ్గా ఏడాదిన్నర కూడా లేదు. అయితే పవన్ పార్టీ వైపు నేతలు మాత్రం ఇంకా ఎవ్వరూ రావడం లేదు!
పవన్ కల్యాణ్ తను చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాడు కానీ నేతల చేరిక అనే ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలను పవన్ కల్యాణ్ బాగా భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన వైపుకు రాకపోతే మీకు కాపు లెవ్వరూ ఓట్లు వేయరన్నట్టుగా పవన్ కల్యాణ్ పదే పదే వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ హెచ్చరికలకు వారు పెద్దగా భయపడుతున్న దాఖలాలు లేవు.
ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు వచ్చి చేరినా.. ఇప్పటి వరకూ అలాంటి కదలికలు ఏమాత్రం లేవు! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ మీద అనుమానం మెదులుతున్న వాళ్లు కూడా ఇప్పటి వరకూ ఒక్కరైనా పవన్ పట్ల కాస్త సానుకూలంగా అయిన మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదు. మరి ఇదే అసహనం పవన్ కల్యాణ్ ను తొలుస్తున్నట్టుగా ఉంది.
అసలే తనను తను అతిగా ఊహించుకునే పవన్ కల్యాణ్ కు ఇంతకు మించి ఇబ్బంది పెట్టే అంశం మరోటి ఉండదు. మరి ఈ అసహనంలో ఆయన ఇంకా ఎలా రెచ్చిపోతారో!