జోనూ లేదు… గీనూ లేదు..

విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఉత్తరాంధ్రా వాసుల యాభై ఏళ్ల చిరకాల కోరిక అయిన విశాఖకు  రైల్వే జోన్ అన్నది సాకారం అవుతుంది అని అంతా సంబరపడ్డారు. ఒక వైపు స్టీల్ ప్లాంట్…

విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఉత్తరాంధ్రా వాసుల యాభై ఏళ్ల చిరకాల కోరిక అయిన విశాఖకు  రైల్వే జోన్ అన్నది సాకారం అవుతుంది అని అంతా సంబరపడ్డారు. ఒక వైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో  కేంద్రం మీద కోపం ఉన్నా రైల్వే జోన్ అయినా వస్తోంది కదా అని సంతోషిస్తున్నారు. 120 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖలో జోనల్ ఆఫీస్ బిల్డింగ్స్ కి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుంది అని ఇప్పటిదాకా అయితే విపరీతమైన ప్రచారం సాగింది.

కానీ ఇపుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అది మార్చేశారా లేక మొదటి నుంచి జరిగిన ప్రచారం ఉత్తుత్తిదా అన్నది అయితే తెలియడంలేదు కానీ లేటెస్ట్ మ్యాటర్ ఏంటి అంటే విశాఖ జోనల్ ఆఫీస్ కి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన లేదని. అంటే జోన్ సంగతి ఏంటి అంటే తరువాత ఆది చూద్దామని బీజేపీ నాయకులు చెబుతున్నారుట.

ప్రధాని టూర్ లో ఇతర కార్యక్రమాలను చేర్చారు కానీ విశాఖ రైల్వే జోన్ అన్నది లేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అంటే వైసీపీ ప్రధాని టూర్ ప్రోగ్రాం మొత్తం హై జాక్ చేస్తోంది కాబట్టి జోన్ అన్నది ప్రధాని ఇపుడు చేయించకపోవడమే మంచిది అని వారు భావించి పై ఎత్తు వేసి ఆపేయించారు అని చెబుతున్నారు.

అయితే అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. ప్రధాని చేతుల మీదుగా కనుక జోనల్ ఆఫీస్ కి శ్రీకారం చుడితే బీజేపీ మీద అది పూర్తి స్థాయిలో వత్తిడి పెట్టే అంశం అవుతుందని, బీజేపీ కచ్చితంగా జోన్ విషయంలో బాధ్యత తీసుకోవాలని. తేడా వస్తే కార్నర్ అవుతుందని ఆలోచించే వాయిదా వేశారు అని అంటున్నారు.

ఇవన్నీ చూస్తూంటే ఇప్పటికైతే తెలిసినది తేలినది ఏమిటి అంటే విశాఖ జోన్ ఇంకా గాలిలోనే ఉందని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం విశాఖ జోన్ అని ప్రకటించినా అది ఈ రోజుకీ కాగితాల మీదనే ఉంది. ఇపుడు దానికి కార్యరూపం వచ్చిందని సంబరపడినంతసేపు లేదు. ఆ ప్రోగ్రాం లేదు అంటున్నారు. అంటే విశాఖకు జోన్ ఇచ్చే విషయం ఇంకా పెండింగులోనే ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి.

బీజేపీ నాయకులు మాత్రం జోన్ ఎపుడో ప్రకటించేశామని, జోనల్ ఆఫీస్ భవనాలకు శంకుస్థాపన ఒక లాంచనం మాత్రమేనని, అందువల్ల కంగారు పడాల్సింది లేదని అంటున్నారు. కానీ విశాఖకు ప్రధాని రాక ముందే బీజేపీ నాయకులు లాస్ట్ పంచ్ తో షాక్ ఇచ్చేశారు అని అంటున్నారు. ఇంతకీ దీని గురించి చెప్పుకోవాలీ అంటే అపుడెపుడో ఒక టీడీపీ నేత పార్టీ లేదు ఏమీ లేదు అని అన్నట్లుగానే జోనూ లేదు గీనూ లేదు అని అనుకోవాల్సిందేనా అంటే క్లారిటీగా అయితే ఈ రోజుకీ జవాబు లేదు.