ప్రధాని మోడీ పర్యటన దగ్గరపడుతూంటే విశాఖలో ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వేదికగా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ కార్మిక లోకమంతా రోడ్ల పైకి వచ్చి ర్యాలీ నిర్వహించింది.
విశాఖ వంటి లాభసాటి ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావించండం తప్పుడు నిర్ణయం అని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఏణ్నర్ధంగా తాము ఆందోళన చేస్తూంటే దానికి కేంద్రం నుంచి సరైన స్పందన లేదని వారు మండిపడుతున్నారు.
ఇపుడు ప్రధానే సరాసరి విశాఖకు వస్తున్న నేపధ్యంలో ఆయన కచ్చితమైన హామీ ఇచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ గౌరవాన్ని నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో బైక్ ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు.
విశాఖలో సెక్షన్ 30 అమలులో ఉంది. అయినా సరే ఆందోళనలు నిర్వహిస్తూండడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో స్టీల్ ప్లాంట్ పరిసరాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నెల 12 వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని, విశాఖ ప్లాంట్ ని పరిరక్షించుకుంటామని కార్మిక నాయకులు స్పష్టం చేస్తున్నారు.
దేనికైనా మేము సిద్ధమని వారు ప్రకటించడంతో విశాఖలో ఉద్యమాల అగ్గి రాజుకున్నట్లు అయింది. విశాఖ టూర్ లో మోడీ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయాన్ని ప్రస్తావిస్తారా, కార్మిక లోకానికి గట్టి భరోసా ఇస్తారా లేదా అన్నది అసక్తికరంగా మారింది.