చంద్ర‌బాబు, ప‌వ‌న్ అప్పుడు న్యాయం గెలిచింద‌న్నారే!

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ గురించి ఆ మ‌ధ్య సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వులు వ‌చ్చిన‌ప్పుడు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ లు గ‌ట్టిగా స్పందించారు. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు…

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ గురించి ఆ మ‌ధ్య సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వులు వ‌చ్చిన‌ప్పుడు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ల్యాణ్ లు గ‌ట్టిగా స్పందించారు. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు అయిపోయాకా, ఆ అంశంపై ఈ పార్టీలు కోర్టుకు ఎక్కాయి. వాటి నిర్వ‌హ‌ణ గురించి టీడీపీ నేత‌లు, జ‌న‌సేన వాళ్లు వేర్వేరు పిటిష‌న్లు వేశారు. వాటిని ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ ను సామూహికంగా చేశారు. 

ఆ మేర‌కు ఏపీలో పోలింగ్ పూర్త‌యిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తూ సింగిల్ జ‌డ్జి తీర్పును ఇచ్చారు. వాటి  నిర్వ‌హ‌ణ‌కు అయిన ఖ‌ర్చు అయిన‌ప్ప‌టికీ, పోలింగ్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్టుగా, ఆ ఎన్నిక‌ల‌ను మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని కూడా కోర్టు అప్పుడు ఆదేశించింది.

ఆ ఆదేశాల‌పై టీడీపీ సంబ‌రంగా స్పందించింది, అలాగే జ‌న‌సేన కూడా. న్యాయం గెలిచిందంటూ చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు స్పందించారు. ఆ స్థానిక ఎన్నిక‌లు సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వుల మేర‌కు ర‌ద్దు కావ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి చెంప దెబ్బ త‌గిలింద‌ని, న్యాయం గెలిచింద‌ని ఆనందంగా స్పందించారు. 

అయితే ఇప్పుడు సింగిల్ జ‌డ్జి ఉత్త‌ర్వుల‌ను ఏపీ హై కోర్టు కొట్టి వేసింది. ఆ ఎన్నిక‌ల కౌంటింగ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఏపీలో ఈ ఎన్నికల పోలింగ్ జ‌రిగిందే కోర్టు ఆదేశాల మేర‌కు అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. రేపు పోలింగ్ జ‌రుగుతుంద‌న్నంగా కూడా ఆ అంశంపై కోర్టులో విచార‌ణ జ‌రిగింది. 

ఆఖ‌రి నిమిషంలో కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతోనే పోలింగ్ జ‌రిగింది. అయితే అనంత‌రం ఒక కోర్టు ఈ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయ‌గా, ఏపీ ఎస్ఈసీ ధ‌ర్మాస‌నాన్ని ఆశ్ర‌యించింది. ఇప్పుడు ధ‌ర్మాస‌నం కౌంటింగ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మ‌రి ఈ ఎన్నిక‌ల‌ను ఒక న్యాయ‌స్థానం ర‌ద్దు చేసిన‌ప్పుడు న్యాయం గెలిచింద‌న్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు.. ఇప్పుడు ఎలా స్పందిస్తున్న‌ట్టో!