జగన్ సర్కారు మరో కీలకమైన ముందడుగు

ప్రభుత్వ ఆస్తి అంటే అది పూర్తిగా ప్రభుత్వ ఆస్తి మాత్రమే. అది భూమి అయినా, ఇల్లు అయినా కేవలం లబ్దిదారుడు అనుభవించడానికి మాత్రమే. హక్కుదారు మాత్రం కాదు. ఇప్పుడీ పద్ధతిని పూర్తిగా మార్చబోతున్నారు ముఖ్యమంత్రి…

ప్రభుత్వ ఆస్తి అంటే అది పూర్తిగా ప్రభుత్వ ఆస్తి మాత్రమే. అది భూమి అయినా, ఇల్లు అయినా కేవలం లబ్దిదారుడు అనుభవించడానికి మాత్రమే. హక్కుదారు మాత్రం కాదు. ఇప్పుడీ పద్ధతిని పూర్తిగా మార్చబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్ని వాళ్ల సొంత ఆస్తిగా మార్చబోతున్నారు. ఈ మేరకు ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు.

“వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం ద్వారా లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తిని పూర్తిగా వాళ్ల సొంతం చేయబోతున్నాం. సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ శాఖ లబ్దిదారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసి వాళ్ల సొంత ఆస్తిగా మారుస్తుంది. లబ్దిదారులు ఆ ఆస్తిని బ్యాంకులో కుదువ పెట్టుకోవచ్చు. తమ పిల్లలకు బహుమతులుగా ఇచ్చుకోవచ్చు. లేదంటే అవసరాన్ని బట్టి దాన్ని అమ్ముకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తిని లబ్దిదారులకు ప్రైవేటు ఆస్తిగా మార్చి ఇవ్వబోతున్నాం.”

ఇలా పేదలకు ప్రభుత్వం తరఫున శుభవార్త అందించారు మంత్రి పేర్ని నాని. ఈ వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మందికి పైగా పేదలు లబ్ది పొందబోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకంటూ సొంత ఆస్తిని అందుకోబోతున్నారు.

ఈ వన్ టైమ్ సెటిల్ మెంట్ ను గ్రామీణ ప్రాంతాల్లో 10వేల రూపాయలుగా, మున్సిపాల్టీల్లో 15వేల రూపాయలుగా, నగరపాలక సంస్థల పరిథిలో 20వేల రూపాయలుగా నిర్ణయించారు. నిర్ణీత మొత్తాల్ని చెల్లించి, ప్రస్తుతం ఉంటున్న ప్రభుత్వ ఇల్లు లేదా అనుభవిస్తున్న ప్రభుత్వ స్థలాన్ని తమ పేరిట ప్రైవేటు ఆస్తిగా లబ్దిదారులు మార్చుకోవచ్చు.

డిసెంబర్ 15 వరకు ఈ పథకానికి దీనికి గడువు ఇచ్చారు. ప్రభుత్వం వద్ద స్థలం పొంది, సొంత డబ్బుతో ఇల్లు కట్టుకున్న లబ్దిదారులకు ఎలాంటి వన్ టైమ్ సెటిల్ మెంట్ ఉండదు. వాళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందిస్తారు. భారతదేశంలో ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాన్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తీసుకోలేదు.

నిజానికి ఇది కొత్తగా మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయం కాదు. తన పాదయాత్ర టైమ్ లోనే జగన్, పేదలకు ఈ హామీ ఇచ్చారు. ఇల్లు కట్టించి ఇవ్వడమే కాకుండా, ఆ ఇంటిని వ్యక్తిగత ఆస్తిగా మార్చి పేదలను ధనవంతుల్ని చేస్తానని గతంలోనే మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, తమ హామీని అమలు చేసే దిశగా ఈరోజు తీర్మానం చేశారు.