యాదాద్రి గుడిలో కేసీఆర్‌ బొమ్మ.. తప్పా.? ఒప్పా.?

ఆంధ్రప్రదేశ్‌కి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు ఎలాగో.. తెలంగాణకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలాగ.! ఆ ఉద్దేశ్యంతోనే, యాదగిరిగుట్ట పేరుని, యాదాద్రిగా మార్చి.. వందల కోట్లు వెచ్చించి మరీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇదంతా దేవుడి మీద…

ఆంధ్రప్రదేశ్‌కి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు ఎలాగో.. తెలంగాణకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలాగ.! ఆ ఉద్దేశ్యంతోనే, యాదగిరిగుట్ట పేరుని, యాదాద్రిగా మార్చి.. వందల కోట్లు వెచ్చించి మరీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇదంతా దేవుడి మీద భక్తితోనే చేస్తున్నారా.? ఆ పేరుతో, యాదగిరిగుట్ట ప్రాంతంలో రియల్‌ బూమ్‌ పెంచుతున్నారా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

మిగతా విషయాల్ని పక్కన పెడితే, యాదాద్రి దేవాలయానికి సంబంధించి సరికొత్త వివాదం తెరపైకొచ్చింది. దేవాలయంలో కేసీఆర్‌ బొమ్మని ఓ రాతి స్తంభం మీద చెక్కేశారు శిల్పులు. ఆ వ్యవహారంపై బీజేపీతోపాటు కాంగ్రెస్‌ నేతలూ నానా యాగీ చేస్తున్నారు. కేసీఆర్‌ బొమ్మ మాత్రమే కాదు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన కొన్ని సంక్షేమ పథకాల్ని ప్రతిబింబించే బొమ్మల్నీ శిల్పులు చెక్కారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు 'కారు'ని కూడా విడిచిపెట్టలేదు శిల్పులు.

'పూర్వం రాజులు దేవాలయాలు నిర్మించినప్పుడు, ఆ రాజులు తమకు పని కల్పించినందుకు గుర్తుగా శిల్పులు ఆ రాజుల విగ్రహాల్ని చెక్కేవారు.. ఇప్పుడు యాదాద్రి విషయంలోనూ శిల్పులు కొందరు అలా వ్యవహరించి వుండొచ్చు. ఇందులో ఉద్దేశ్యపూర్వక వ్యవహారం ఏమీ లేదు..' అంటూ అధికారులు స్వయంగా మీడియా ముందుకొచ్చి 'కథలు' విన్పించారు.

యాదాద్రి దేవాలయానికి సంబంధించి ప్రతి అడుగూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనుసన్నల్లోనే జరుగుతోంది. అలాంటప్పుడు, కేసీఆర్‌కి తెలియుకుండా ఆయన బొమ్మల్ని శిల్పాలపై ఎలా చెక్కుతారు.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక అధికారులు నానా తంటాలూ పడ్డారు. అన్నట్టు, కారు గుర్తు మాత్రమే కాదు, పద్మం గుర్తు.. అలాగే సైకిల్‌ గుర్తునీ శిల్పులు చెక్కారన్నది అధికారులు చెబుతున్నమాట.

మొత్తమ్మీద, ఈ వివాదం ముందు ముందు మరింత ముదిరి పాకాన పడేలా వుందన్నమాట. మరి, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించి, 'అంతా నా ఇష్టం' అంటారా.? లైట్‌ తీసుకుంటారా.? 'అభ్యంతరాలు వస్తే, ఆ బొమ్మల్ని సరి చేస్తాం..' అని చెబుతున్న అధికారులు, అంత పనీ చేయగలరా.? వేచి చూడాల్సిందే.