చంద్రబాబు, గంటాకు వాటాల్లో తేడా వచ్చిందా?

అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జనకు తెరదీసిన చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు అప్పట్లో బాగానే కలిసున్నారని.. పదవులు పోయిన తర్వాత వాళ్లిద్దరికీ వాటాల్లో తేడాలు వచ్చాయని ఆరోపించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అధికారంలో ఉన్నప్పుడు సిట్ రాకుండా…

అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జనకు తెరదీసిన చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు అప్పట్లో బాగానే కలిసున్నారని.. పదవులు పోయిన తర్వాత వాళ్లిద్దరికీ వాటాల్లో తేడాలు వచ్చాయని ఆరోపించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అధికారంలో ఉన్నప్పుడు సిట్ రాకుండా అడ్డుకున్న గంటా, ఇప్పుడు పదవి పోయిన తర్వాత సిట్ వేయమని కోరడం కేవలం చంద్రబాబును ఇరికించడానికేనని విమర్శించారు.

“నువ్వు (గంటా) అధికారంలో ఉన్నప్పుడే కబ్జాలు బాగా జరిగాయి. అప్పుడు చంద్రబాబు సిట్ ఎందుకు ఓపెన్ చేయలేదు. అంటే ఈ కబ్జాల్లో బాబు, లోకేష్ కు కూడా వాటాలు ఉన్నాయా? ఇప్పుడు చంద్రబాబుకు నీకు వాటాల్లో తేడా వచ్చిందా? అమరావతిలో చంద్రబాబుకు నారాయణ బినామీ. ఇక్కడ విశాఖలో నువ్వు బాబుకు బినామీవా? అప్పుడు సిట్ తెరపైకి రాకుండా ఎందుకు చేశారు? ఈ కబ్జాల్లో దోషి నువ్వా, చంద్రబాబా, లోకేషా?”

విశాఖలో భూకబ్జాలపై ఏర్పాటుచేసిన సిట్ ను స్వాగతిస్తూ ప్రభుత్వానికి గంటా లేఖ రాయడాన్ని తప్పుబట్టారు అవంతి. టీడీపీ హయాంలో గంటా చేసిన కబ్జాల్ని విశాఖలో ఏ చెట్టును, పుట్టను అడిగినా చెబుతుందని ఎద్దేవా చేశారు. అప్పటి కబ్జాల్ని ప్రజలు మరిచిపోయారని గంటా భావించడం అవివేకం అన్నారు.

“విశాఖలో ఏ చెట్టును అడిగినా, పుట్టనడిగినా, గోడను అడిగినా మాజీ మంత్రి గంటా చేసిన కబ్జాల్ని కథలు కథలుగా కోకొల్లలుగా చెబుతారు. వాటిని ఎవ్వరూ మరిచిపోలేదు. విశాఖలో భూ కబ్జాలపై సిట్ వేస్తున్నారని తెలుసు. సీఎం సంతకం అయిందని కూడా తెలుసు. ఈ టైమ్ లో సిట్ ను స్వాగతిస్తూ లేఖ రాసి వైసీపీ తనను బద్నాం చేస్తోందనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గంటా శ్రీనివాసరావు. లేఖతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.”

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన అవంతి శ్రీనివాస్.. అవినీతిపరులకు వైసీపీలో చోటు దక్కదని పరోక్షంగా గంటాను ఉద్దేశించి కామెంట్ చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం విశాఖలో ఒక్క గజం భూమి కూడా కబ్జాకు గురవ్వదని ప్రకటించారు.