జేసీ ‘ఉచిత’ సలహా.. జగన్‌ లెక్కచేస్తారా.?

ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలి ఎన్నికలకు ముందే ప్రకటించిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తన స్థానంలో తన కుమారుడ్ని రాజకీయాల్లో యాక్టివ్‌ చెయ్యాలనుకున్నారు.. చేశారుగానీ, జేసీ పప్పులుడకలేదు. వైఎస్సార్సీపీ హోరులో తెలుగుదేశం…

ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలి ఎన్నికలకు ముందే ప్రకటించిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తన స్థానంలో తన కుమారుడ్ని రాజకీయాల్లో యాక్టివ్‌ చెయ్యాలనుకున్నారు.. చేశారుగానీ, జేసీ పప్పులుడకలేదు. వైఎస్సార్సీపీ హోరులో తెలుగుదేశం పార్టీ కొట్టుకు పోతే, ఆ టీడీపీ జెండా పట్టుకున్న జేసీ కుటుంబం కూడా గల్లంతయిపోయింది రాజకీయంగా.

కాగా, 'నోటి దురద'కి కేరాఫ్‌ అడ్రస్‌.. అనదగ్గ రాజకీయ నాయకుల్లో జేసీ దివాకర్‌రెడ్డి ఒకరు. ఆయనిప్పుడు ఉచిత సలహాలిచ్చే కార్యక్రమం షురూ చేశారు. అదీ, వైఎస్సార్సీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి కావడమే గమనార్హం. 'జగన్‌ మావాడే.. సలహాలు అడిగితే ఇచ్చేస్తా.. జగన్‌ పాలన గురించి మాట్లాడాలంటే నూటికి నూరు మార్కులు ఇచ్చేయొచ్చు..' అంటూ జేసీ దివాకర్‌రెడ్డి తనదైన స్టయిల్లో మీడియా మైకుల్ని కొరికేశారు.

కాస్త వెనక్కి వెళితే, అనంతపురం జిల్లాలో తన అహంకారాన్ని చాటుకునే క్రమంలో ఓ పోలీస్‌ అధికారపై నోరు జారారు జేసీ దివాకర్‌రెడ్డి. పౌరుషంతో ఊగిపోయిన సదరు పోలీస్‌ అధికారి, ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనెవరో కాదు, హిందూపురం ఎంపీగా ఇటీవల గెలిచిన గోరంట్ల మాధవ్‌. రాజకీయాల్లో తలపండిపోయిన జేసీ దివాకర్‌రెడ్డి, ఈ అవమాన భారాన్ని దిగమించుకోగలగడం గొప్ప విషయమే. అందుకే, అంత ఉచితంగా జగన్‌కి సలహాలిచ్చేస్తానని మీడియా ముందు ధైర్యంగా ప్రకటించేసుకున్నారు.

ఏ పార్టీలో వున్నా, ఆ పార్టీని వెన్నుపోటు పొడవడం జేసీ దివాకర్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబుని పొగుడుతూనే, తెలుగుదేశం పార్టీని వీలు చిక్కినప్పుడల్లా ఇరకాటంలో పడేశారాయన. కాంగ్రెస్‌లో వున్నప్పుడూ అంతే. అలాంటి జేసీ దివాకర్‌రెడ్డిని, వైఎస్‌ జగన్‌ 'దగ్గరకు తీసుకోవడం' కాదు కదా, కనీసం ఆయన్ని లెక్క చేసే పరిస్థితి కూడా వుండదు. 'మావాడే..' అంటే, 'మా కులపోడే' అనా.? 'మా రాయలసీమోడే' అనా.? అర్థం ఏదైనా, జగన్‌ మాత్రం అలా ఫీలయ్యే పరిస్థితే లేదు.

అలా ఇలా కాదు, ఏకంగా జగన్‌ని బూతులు తిట్టేసింది జేసీ కుటుంబం.. గడచిన ఐదేళ్ళలో. వాటిని జగన్‌ మర్చిపోతారా.?