ఏది దేశద్రోహం, ఏది జాతి వ్యతిరేకం, ఎవరు దేశంలో ఉండాలి, ఎవరు పాకిస్తాన్ వెళ్లిపోవాలి.. వంటి అంశాల గురించి భారతీయ జనతా పార్టీ నేతలు బహిరంగ తీర్పులు ఇవ్వడం కొనసాగుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశాల గురించి బీజేపీవాళ్లు బోలెడన్ని తీర్పులు ఇచ్చారు. తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీనేత ఒకరు పోర్న్ చూడటం దేశద్రోహం కాదు అని వ్యాఖ్యానించారు.
ఇంతకీ ఎందుకు ఆయన ఆ చర్యను సమర్థించారంటే.. కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ చూస్తూ అడ్డంగా బుక్ అయిన అప్పటి ఎమ్మెల్యే ఒకరికి ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు కదా. ఆ విషయంలో తీవ్ర విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న వేళ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పోర్న్ చూస్తూ పట్టుబడ్డారు.
ఆ విషయం తీవ్రదుమారం రేగడంతో అప్పటి సీఎం సదానందగౌడ వారిచేత రాజీనామా చేయించారు. ఆ ముగ్గురులో ఒకరైన లక్ష్మణ్ అనే నేతను ప్రజలు మళ్లీ గెలిపించలేదు. ఇటీవలి ఎన్నికల్లో కూడా ఆయనను వారు ఓడించారు. అయితే ఇప్పుడు ఆయనకే ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చి, మంత్రిత్వ శాఖను అప్పగించారు. దీంతో అతడిని సమర్థించే పని మొదలైంది.
అందులో భాగంగా మంత్రి జేసీ మధుస్వామి మాట్లాడుతూ.. అసెంబ్లీలో నీలిచిత్రాలు చూడటం తప్పేం కాదన్నాడు. అదేమీ యాంటీ నేషనల్ ఎలిమెంట్ కాదని వ్యాఖ్యానించారు. ఏదో యాక్సిడెంటల్ గా పోర్న్ వీడియోలు ఓపెన్ కావడంతో వారు చూశారని సమర్థించారు. అందరూ తప్పులు చేస్తారని.. అలాగే వాళ్లు కూడా.. అని తేల్చారు.
ఇదన్నమాట.. అసెంబ్లీలో పోర్న్ చూడటం జాతి వ్యతిరేక చర్యకాదు అని బీజేపీ నేతలు సూత్రీకరించారు. ఎందుకంటే వాళ్లే దొరికిపోయారు కాబట్టి. వాళ్లు దొరికే విషయాలన్నీ జాతి వ్యతిరేకం కాదు, వేరేవన్నీ జాతి వ్యతిరేక చర్యలు. ఇలా రాజ్యాంగాన్ని సవరణ చేసుకుంటే పోదా!