ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం…అంతా మోసమే. భారత్ దురాక్రమణకు చైనా తెగపడుతూ ఒక రకమైన మోసానికి పాల్పడుతుంటే, మనపై ప్రేమ మాటలు వల్లె వేస్తూ…ఆచరణలో మాత్రం చైనాకు ఏ మాత్రం తీసిపోని విధంగా అగ్రరాజ్యం అమెరికా వంచిస్తోంది.
“వైట్ హౌస్‌లో ఉన్న ప్రస్తుత పాలనా యంత్రాంగ క్రూరత్వానికి హద్దులే లేకుండా పోతున్నాయి” అని ఇటీవల అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న సెనెటర్ బెర్నీ శాండర్స్ తాజా విమర్శలివి. దీన్నిబట్టి విదేశీ విద్యార్థులకు సంబంధించి ట్రంప్ సర్కార్ తీసుకున్న ఎంత అమానవీయంగా, దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్న ట్టయితే విదేశీ విద్యార్థులు తమ దేశం విడిచి వెళ్లాలని అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అమెరికా తాజా నిర్ణయంతో మరీ ముఖ్యంగా మన దేశ విద్యార్థులు భారీగా నష్టపోనున్నారు. ఎందుకంటే అమెరికాలో పెద్ద సంఖ్యలో మన విద్యార్థులు చదువు కుంటున్నారు. అంతేకాదు, కొత్తగా విద్యార్థులకు వీసాలు కూడా జారీ చేసేది లేదని అమెరికా స్పష్టం చేసింది.
అమెరికాలో చదువుకుంటున్న, చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నిద్రలేని రాత్రులు మిగిల్చుతున్న అమెరికా తాజా ప్రకటన ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
‘వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించిన స్కూళ్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోం. అలాంటి వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ దేశంలోకి అనుమతించదు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(ఎఫ్-1 ఎం-1-తాత్కాలిక ప్రాతిపదికన జారీ చేసేవి) మీద ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్‌లైన్ క్లాసులు వింటున్న వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకుంటే స్కూల్‌కు వెళ్లేందుకు అనుమతి ఉన్న విద్యా సంస్థకు బదిలీ చేయించుకోవాలి. అలా జరగని పక్షంలో ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అనుసరించి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’ అని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) సోమవారం హెచ్చరికతో కూడిన ప్రకటన విడుదల చేసింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) లెక్కల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరానికి గానూ అమెరికాలో దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా విద్యార్థు లదే అగ్రస్థానం. ఎక్కడెక్కడి నుంచో, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, సప్త సముద్రాలు దాటి అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వ తాజా ప్రకటన పిడుగు పాటైంది. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటో విద్యార్థులకు బోధ పడడం లేదు.
ట్రంప్ తాజా నిర్ణయంపై ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్‌ది మూర్ఖపు నిర్ణయమని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఇది లక్షలాది మంది విదేశీ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అని తీవ్రస్థాయిలో మండిపడింది.