కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో రీతిగా వ్యవహరిస్తోంది. అధ్వాన్నంగా వ్యవహరించినవాటిలో బెంగాల్ ఒకటి. గమనిస్తే మెట్రోలున్న రాష్ట్రాలన్నిటిలో యీ సమస్య తీవ్రంగా వుంది. ఆ తర్వాత పెద్ద నగరాలున్న రాష్ట్రాలలోనూ వ్యాధి వ్యాపిస్తోంది. దీనికంతా కారణం ఆ నగరాలలోని మురికివాడలు. మామూలుగానే అక్కడుండేవారు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పరిస్థితుల్లో నివసించడం అసాధ్యం. లాక్డౌన్ పేర రోజులో ఇరవై నాలుగు గంటలూ వారిని ఆ వాడల్లోనే వుంచేయడంతో వారు సులభంగా జబ్బు పడ్డారు. తాము మసలిన చోటల్లా ఆ వ్యాధిని యితరులకు అంటించారు.
కలకత్తా నగరంలో మురికివాడలు ఎక్కడున్నాయా అని వెతకనక్కరలేదు. అసలే ఊరే ఓ పెద్ద మురికివాడలా తోస్తుంది, హౌడా రైల్వే స్టేషన్లో దిగి కొన్ని మైళ్లు ప్రయాణించేటప్పటికి! కొన్ని ప్రాంతాలు మాత్రం బాగుంటాయి. మొదటిసారి ఆ వూరు వెళ్లినవాళ్లకు ప్రధాన రహదారుల్లో పేవ్మెంట్ల మీద కాపురం వుండే పేదలను చూసి మతి పోతుంది. బస్సుల్లో, ట్రాముల్లో, లోకల్ రైళ్లలో కిక్కిరిసి వెళ్లే జనాలను చూస్తే కళ్లు తిరుగుతాయి. ఎక్కడ చూసినా జనమే. ఎవరికీ పరిశుభ్రత ఉన్నట్లు తోచదు. చాలా పెద్ద హోటళ్లు తప్ప, ఓ పాటి ఉడుపి హోటల్ లాటిది కనబడదు. జనమంతా రోడ్ల పక్కన నిరభ్యంతరంగా తినేస్తూ వుంటారు.
ఇలాటి వూరిలో కోవిడ్ వంటి భయంకరమైన అంటువ్యాధి ఎంతటి ప్రభావం చూపుతుందో ఎవరైనా ఊహించవచ్చు. వ్యాధి ప్రకోపం చూశాకైనా పౌరులు క్రమశిక్షణగా వుండి, జాగ్రత్త పడితే పరిస్థితి కొంత బాగుపడేది. కానీ బెంగాల్లో లేనిదే, క్రమశిక్షణ. ముంబయిలో బస్సు ఎక్కేటప్పుడు క్యూ పాటిస్తారు, కలకత్తాలో అలాటి ప్రశ్నే ఉదయించదు. ప్రజలు ఎవరి మాటా వినరు. ప్రభుత్వోద్యోగులలో బద్ధకం, నిర్లక్ష్యం ఎక్కువ. కలకత్తా మెట్రో ఒక్కటే అన్ని రకాలుగానూ మినహాయింపు. ఏదైనా సరే పద్ధతి ప్రకారం వుండడమనేది, కలకత్తాలో అరుదుగా జరుగుతుంది. అందుకే ఒకప్పుడు దేశరాజధానిగా, పారిశ్రామిక రాజధానిగా వున్న కలకత్తా క్రమేపీ కళ తప్పింది.
ప్రభుత్వాధినేతగా ఎవరున్నా సరే, కలకత్తాలో ఏదైనా సాధించడమంటే ఏటికి ఎదురీదడం లాటిదే. నిన్న సిపిఎం ఉన్నా, ఈ రోజు తృణమూల్ ఉన్నా, రేపు బిజెపి ఉన్నా పరిస్థితుల్లో మార్పు రావడం చాలా కష్టం. ఎందుకంటే కలకత్తాలో ఉండేది బెంగాలీలు మాత్రమే కాదు. చుట్టుపట్ల రాష్ట్రాలలోని పేదలందరూ అక్కడికే వచ్చి చేరతారు. ఎలాగోలా బతకడానికి తంటాలు పడుతూ, పరిస్థితులను అతలాకుతలం చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే సిటీ ఈజ్ అన్మేనేజబుల్!
దీనికి తోడు ప్రస్తుతం రాజ్యం చేస్తున్నది, మమతా బెనర్జీ! అసలే తిక్క మనిషి, వైఫల్యాలు ఒప్పుకునే రకం కాదు. పైగా గత కొద్దికాలంగా బిజెపి కారణంగా రాజకీయ అనిశ్చితి ఎదుర్కుంటోంది. వాళ్లు ప్రతీదానికీ గొడవ చేస్తున్నారు, గవర్నరు ద్వారా యిబ్బంది పెడుతున్నారు. ఈమె కూడా మొరటుగా వాళ్లను ఎదుర్కుంటూ వస్తోంది. ఇలాటి టైములో యీ అంటువ్యాధి వచ్చిపడింది.
ఇక బిజెపి. 2019లో పార్లమెంటు ఎన్నికలలో 40 శాతం ఓట్లు, 42టిలో 18 సీట్లు (అసెంబ్లీ నియోజకవర్గాలుగా తర్జుమా చేస్తే 120) గెలిచి 2021 అసెంబ్లీ ఎన్నికలకు ఉవ్విళ్లూరుతోంది. ‘ఎయ్ బార్ బంగాల్’ (ఈసారి బెంగాల్) అనే రణన్నినాదం యిచ్చి మమతను అనునిత్యం దుయ్యబడుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత ఒకళ్లిద్దరు తృణమూల్ నాయకులు తమవైపు ఫిరాయించడంతో, ఇంకేముంది తృణమూల్ ఖాళీ అయిపోతోంది, అంతా మా పక్కకు వచ్చేస్తున్నారని ఆశ పెట్టుకుని ఆ మేరకు ప్రకటించేసింది.
తీరా చూస్తే ఎవరూ రాలేదు. తృణమూల్‌లో యిప్పటికీ 35 ఎంపీలు, 215 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కోవిడ్, ఏంఫన్ తుపాను ఎదుర్కోవడంలో పార్టీ అప్రదిష్ఠపాలైన తర్వాత కూడా యిప్పటివరకు ఒకళ్లిద్దరు మంత్రులు సాటి మంత్రుల గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు తప్ప. తక్కినవాళ్లు బిజెపివైపు గెంతుకుంటూ రాలేదు. పైగా సిఏఏ, ఎన్పిఆర్ విషయంలో బిజెపి తీసుకున్న మతపరమైన విభజన స్టాండ్ బెంగాలీలను మెప్పించలేదు. ఆ విషయంలో మమత బిజెపిపై పైచేయి సాధించిందనే చెప్పాలి. అందువలన కాస్త క్రుంగుబాటులో వున్న బిజెపికి కోవిడ్ భలేగా పనికి వచ్చింది. దానికి తోడుగా తుపాను కూడా వచ్చి రాష్ట్రమంతా అల్లకల్లలోలం కావడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో విజయం తమదే అనే ధీమాలో ఉన్నారు.
కోవిడ్ విషయంలో మమత తొలి నుంచీ మూర్ఖంగా, మొండిగా వ్యవహరించింది. వ్యాధి తీవ్రతను గుర్తించకపోవడం, టెస్టులు చేయించకపోవడం, అంకెలు దాచిపెట్టడం, లాక్డౌన్ సమయంలో కొన్ని దుకాణాలు తెరిపించడం.. యిలా చాలా తప్పులు చేసింది. బిజెపి వాటిని ఎత్తి చూపించినకొద్దీ ఉక్రోషంతో మరీమరీ పొరపాట్లు చేసింది. తాము పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా కోవిడ్ అదుపులోకి రావటం లేదని తెలిసినా బిజెపి బెంగాల్‌పై ప్రత్యేకదృష్టి పెట్టి మమతను అల్లరిపాలు చేయాలని చూసింది. సెంట్రల్ టీమ్స్‌ను పంపి వారి చేత వ్యాఖ్యలు చేయించింది. ప్రతిగా మమత వారిని నిరాదరించి, సలహాలు నిరాకరించి వ్యాధి మరింత ముదరడానికి కారకురాలైంది.
మామూలుగానే ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ అధ్వాన్నంగా వుంటుంది. అపరిశుభ్రంగా బతికే అసంఖ్యాక పేద పౌరులున్న కలకత్తా లాటి నగరంలో యింకెలా వుంటుందో ఊహించుకోవచ్చు. అక్కడి ప్రజలు ఎప్పుడూ చూసినా ఫ్రస్ట్రేషన్‌తో ఎవర్ని పట్టుకుని కొడదామా అని చూస్తూంటారు. ప్రతిభావంతులు, నిజాయితీపరులు అయిన డాక్టర్లు దెబ్బలు తిన్న సందర్భాలు అనేకం. కరోనా సమయంలో మన దగ్గరే ప్రభుత్వడాక్టర్లు దెబ్బలు తింటున్నారు. ఇక అక్కడ వేరే చెప్పాలా? రోగం వచ్చినవారు ప్రభుత్వాసుపత్రులకు వెళ్లడమంటే నరకానికి వెళ్లినట్లే. ప్రయివేటు ఆసుపత్రులు, చేసిందేమీ లేకపోయినా దోచేశాయి. హైదరాబాదులోనే అలాటి కేసులు వింటున్నాం. అందువలన తప్పులన్నీ మమత నెత్తిన రుద్దడం భావ్యం కాదు.
మమత లాక్డౌన్ సరిగ్గా అమలు చేయించలేదనే వాదనా కరక్టు కాదనుకుంటాను. కలకత్తాలో నా స్నేహితులున్న చాలా ఏరియాల్లో పకడ్బందీగా అమలైంది. పేదలున్న కొన్ని ప్రాంతాలలో అమలు కాకపోయి వుండవచ్చు. హైదరాబాదులో మాత్రం అన్నిచోట్లా ఒకేలా అమలైందా? ప్రజలకు ఆ స్పృహ ఉండాలి. పోలీసులు ఎంతకని చూడగలరు? సడలింపు యివ్వగానే చేపల దుకాణాలు తెరిపించిందని, పాన్‌షాపులు తెరిపించిందని చాలామంది విరుచుకు పడ్డారు. మన దగ్గర మాత్రం మాంసం దుకాణాలకు అనుమతించినప్పుడు ప్రజలు తిరణాళ్లలా వెళ్లి సామాజికదూరం పాటించకుండా ఒకరి మీద మరొకరు పడిపోలేదా? చేప లేకపోతే బెంగాలీ ముద్ద ముట్టడు. మందు షాపులు తెరిచినప్పుడు? మనకు మందు ఎలాగో వాళ్లకు పాన్ అలాగ! ఒక స్థాయికి మించి ప్రజలను ఏ ముఖ్యమంత్రీ అదుపు చేయలేడు.
కోవిడ్ విషయంలోనే పడుతూలేస్తూ వుంటే వలస కార్మికులను తిరిగి తెప్పించే సమస్య వచ్చింది. బెంగాల్లో పొట్ట గడవక, చాలామంది ముంబయి వంటి అనేక ప్రాంతాలకు వలస పోయారు. శ్రామిక రైళ్లు వేశాక, వాళ్లంతా తిరిగి రాసాగారు. బెంగాల్ వాళ్లే కాదు, ఈశాన్య రాష్ట్రాలవారందరికీ కూడా బెంగాల్యే ముఖద్వారం. వాళ్లంతా తిరిగి వస్తే, అసలే అధ్వాన్నంగా వున్న బెంగాల్ పరిస్థితి మరింత చెడుతుందని భయపడిన మమత ఆ రైళ్లను అడ్డుకుందామని చూసి మరింత చెడ్డపేరు తెచ్చుకుంది. ‘వాటిని కరోనా ఎక్స్‌ప్రెస్‌లుగా స్థానికులు భావిస్తున్నారు‘ అనడంతో బిజెపి యాగీ చేసింది. మొత్తానికి వాళ్లు రానూ వచ్చారు. కేసులూ పెరిగాయి.
ఇది రాస్తున్న జులై మొదటివారాంతానికి బెంగాల్లో (జనాభా 9 కోట్లు ) కేసుల సంఖ్య (టెస్టులు సరిగా చేయలేదు కాబట్టి ఇది నమ్మాలని లేదు) 22 వేలు, మృతుల సంఖ్య – 750.. తమిళనాడు (జనాభా 7 కోట్లు) కేసులు 111 వేలు, మరణాలు 1500, మహారాష్ట్ర (జనాభా 11 కోట్లు) కేసులు 207 వేలు, మరణాలు 8800, దిల్లీ (జనాభా 1.7 కోట్లు) కేసులు 99 వేలు, మరణాలు 3060. మరణాల విషయంలో బెంగాల్‌కు దగ్గరగా వున్నది ఉత్తరప్రదేశ్ (జనాభా 20 కోట్లు) కేసులు 28 వేలు, మరణాలు 785. మెట్రో ఏది లేకపోయినా, వీళ్ల కంటె జనాభా తక్కువగా ఉన్నా, తీవ్రత ఉన్న రాష్ట్రం గుజరాత్ (జనాభా 6 కోట్లు) 36 వేల కేసులు, 1950 మరణాలు. ఈ అంకెల ప్రకారం చూస్తే బెంగాల్ మరీ అంత అధ్వాన్నంగా లేదనిపిస్తుంది. తక్కిన మెట్రోల కంటె కలకత్తాలో చావులు తక్కువ. మొదటినుంచీ మురికిలో బతుకుతున్నారు కాబట్టి ఇమ్యూనిటీ ఎక్కువేమో!
ఏది ఏమైనా క్వారంటైన్ల నిర్వహణలో కూడా బెంగాల్ ప్రభుత్వానికి చాలానే చెడ్డపేరు వచ్చింది. ఇలాటి పరిస్థితిలో భీకరాతి భీకరమైన ఏంఫన్ తుపాను వచ్చి నిరాశ్రయులు మరింతమంది పెరిగారు. లాక్డౌన్ సడలించి రాకపోకలు అనుమతించాక సమస్య మరింత జటిలమైంది. ఎందుకంటే కలకత్తా జనాభా సొంత వాహనాలు ఉపయోగించడం అరుదు. అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్యే వాడతారు. కలకత్తాలో పనిచేసే వారిలో చాలామంది పక్క ఊళ్లలో వుంటూ బస్సుల్లో, రైళ్లల్లో వస్తూ వుంటారు. వాటిని మొదట్లో నిలిపివేసి, తర్వాత కొద్దిగా అనుమతించడంతో ఆఫీసులకు రావలసినవారు వాటిలో కిక్కిరిసి వస్తున్నారు. సామాజికదూరం అవలంబించడం అసాధ్యమై పోయింది.
రాష్ట్రం యిలా సతమతమవుతూండగానే బిజెపి మాత్రం రాజకీయ పోరాటం ప్రారంభించేసింది. పది నెలల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అమిత్ షా జూన్ 9న ‘‘పరివర్తన్’’ (ఈ నినాదం ఒరిజినల్‌గా మమతదే) పేర ‘వర్చువల్ ర్యాలీ’ ప్రారంభించి బిజెపి కార్యకర్తలతో సంభాషించారు. దీనికై రాష్ట్రమంతా 70 వేల టివిలు ఏర్పాటు చేయడంతో యీ కష్టకాలంలో యీ హంగామా కావాలా? అనే విమర్శ వచ్చింది. ‘‘ఇది రాజకీయాలు చేసే సమయమా? మమతను గద్దె దింపండి అనే ఉద్యమం యిప్పుడు అవసరమా? మోదీని దింపేయండి అని నేనేమైనా అడుగుతున్నానా? దేశమంతా కలసికట్టుగా మహమ్మారిని ఎదుర్కోవాలి కానీ యిదేమిటి?’’ అంటూ మమత ధర్మపన్నాలు చెపుతోంది.
అమిత్ షాను ఉద్దేశించి, ‘నువ్వు దేశమంతా గెలవవచ్చు, కొన్ని రాష్ట్రాలు గెలవవచ్చు. కానీ ఇది బెంగాల్. దీని సంగతి నీకు తెలియదు’ అని అంటోంది మమత. తృణమూల్ అచ్చమైన బెంగాలీ పార్టీ అనీ బిజెపి బయటివాళ్ల (బెంగాలీలు ఉత్తరభారతీయులను హిందూస్తానీలంటారు) పార్టీ అని చిత్రీకరిస్తోంది. బిజెపి వాళ్లు మాట్లాడితే రాముడు, హనుమాన్ అంటారని, అసలైన బెంగాలీలు దుర్గ, కాళీ అంటారని గుర్తు చేస్తోంది. దీనికి తగ్గట్టు పార్లమెంటు ఎన్నికలలో కలకత్తాలోని బిహారీలు, యుపి వారు, బిజెపికి ఓటేయడంతో అది హిందుస్తానీల పార్టీగా (ఇప్పుడు మమతపై తిరుగుబాటు ధ్వజమెత్తుతున్న మంత్రి సాధన్ పాండే కూడా ‘హిందూస్తానీ’యే) సాధారణ బెంగాలీలు అనుకుంటే బిజెపికి అసెంబ్లీలో గెలుపు కష్టం. అనేక రాష్ట్రాలలో పార్లమెంటుకి మోదీని, అసెంబ్లీకి స్థానిక బిజెపియేతర నాయకుణ్ని ప్రజలు ఎన్నుకున్నారు. మమతకు దీటు రాగల బెంగాలీ బిజెపి నాయకుడు లేడు.
ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో రాజకీయాలు సరే, అధికార పార్టీ అవినీతికి పాల్పడవచ్చా? కోవిడ్, ఏంఫన్ సహాయ కార్యక్రమాలు, నష్టపరిహారాల వితరణలో తృణమూల్ నాయకులు, కార్యకర్తలు అవినీతికి పాల్పడడంతో, తమ పార్టీ కార్యకర్తలకే పరిహారం యివ్వడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. అది గ్రహించిన మమత తనను తాను దానికి అతీతంగా చూపించుకుంటోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె సహచరులపై శారదా, నారదా స్కాము ఆరోపణలు వచ్చినపుడు ఆమె ‘‘వాళ్లను పట్టించుకోకండి. అన్ని నియోజకవర్గాలలోనూ నేనే అభ్యర్థిని అనుకుని ఓటేయండి.’’ అని అడిగింది. ప్రజలు ఆమె మాట విన్నారు. తర్వాత కూడా తన పార్టీలో అవినీతి ప్రబలి, అభివృద్ధి కార్యక్రమాల్లో కమిషన్లు కొట్టేస్తున్నపుడు ‘‘దీదీకె బోల్’’ అనే నినాదం యిచ్చింది. ‘‘అవినీతి జరిగితే నాకు చెప్పండి. అపరకాళి అవతారమెత్తి స్వపరభేదం లేకుండా వాళ్లని మర్దించేస్తాను.’’ అంది.
ఇప్పుడూ అదే ట్రిక్కు వేస్తోంది. సహాయ కార్యక్రమాల్లో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ వీధుల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లను నిలదీస్తున్నారు, పంచాయితీ అధికారులను, తృణమూల్ కార్యకర్తలను విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితిని బిజెపి వాళ్లు రాజకీయంగా ఉపయోగించుకోకుండా తనే క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. జూన్ 24న చీఫ్ సెక్రటరీని, డిజిపిని పిలిచి ‘‘వివక్షత చూపకుండా అందరికీ సహాయం అందేట్లు చూడండి. ఎవరైనా అడ్డుపడితే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించండి.’’ అని ఆదేశాలిచ్చింది. ‘‘వారం రోజులు టైమిస్తున్నా. మీరు చేసిన తప్పులు దిద్దుకోండి. లేకపోతే శిక్షలు తప్పవు.’’ అని జిల్లా పరిషద్ చైర్మన్లకు వార్నింగు యిచ్చింది.
దీంతో బాటు ఆమె వేసిన ఎత్తుగడ ఏమిటంటే – ‘తుపాను సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి అన్ని పార్టీలతో కలిపి కమిటీలు వేస్తున్నాను. వాటిలో ప్రతిపక్షాలు కూడా పాలుపంచుకోవాలి.’’ అని పిలుపు నిచ్చింది. దీంతో ప్రతిపక్షాల గొంతులో వెలక్కాయ పడింది. బయట నుండి ఎడాపెడా నిందించడం సులభం. కమిటీలో వుండడమంటే బాధ్యత, కర్మకాలితే నింద, పంచుకోవాలి.
దీనితో బాటు మమత జులై 31 వరకు లాక్డౌన్ పొడిగించింది. ఇతర రాష్ట్రాల నుంచి విమానాలను రద్దు చేసింది. కరోనా కట్టడికై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నానన్న పిక్చర్ యిస్తోంది. దీనితో రాజకీయ కార్యక్రమాలు చేసేందుకు వీలు లేకుండా పోయింది.
ఈ లోపుగా సహాయ కార్యక్రమాల్లో అవినీతిపై పార్టీలో క్షాళన కార్యక్రమం ప్రారంభించింది. 76 మంది పార్టీనాయకులకు షోకాజ్ నోటీసులు యిచ్చింది. వారిలో మాజీ మంత్రి, అసన్సోల్ డిప్యూటీ మేయర్, ట్రేడ్ యూనియన్ నాయకుడు, కౌన్సిలర్లు, బ్లాక్ లెవెల్ ప్రెసిడెంట్లు, పంచాయితీ ప్రధాన్‌లు ఉన్నారు. కమిషన్లగా తీసుకున్నది వెనక్కి యిచ్చేయండి అని కూడా చెప్తోంది మమత. ఈ విధంగా తన పార్టీలో అవినీతికి తన ప్రమేయం లేదని చూపిద్దామనుకుంటోంది.
అయినా ఆమె పార్టీలు లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఏంఫన్ సహాయకార్యక్రమాల నిర్వహణ సరిగ్గా లేదని కాబినెట్లో కన్స్యూమర్ ఎఫయిర్స్ మంత్రి కేదార్ పాండే కలకత్తా మాజీ మేయర్, ప్రస్తుతం కలకత్తా మునిసిపల్ కార్పోరేషన్ ఎడ్మినిస్ట్రేటర్స్ బోర్డు చైర్మన్ అయిన ఫిర్హాద్ హకీమ్‌పై విరుచుకుపడ్డాడు. ‘‘నీకు చేతకాకపోతే వెళ్లి గతంలో మేయర్‌గా చేసిన శోభన్ చటర్జీని వెళ్ల అడగలేక పోయావా?’’ అని పబ్లిగ్గా తిట్టాడు. ఈ శోభన్ తృణమూల్‌పై తిరుగుబాటు చేసి, బిజెపిలో చేరిన వ్యక్తి. అతని పేరెత్తడంతో పాండే విమర్శల వెనుక బిజెపి వుందని అందరికీ అనుమానం వచ్చింది.
సిబిఐ విచారణ జరుపుతున్న రోజ్ వ్యాలీ స్కామ్‌లో అతని కూతురి పేరు వుంది కాబట్టి, దాన్ని చూపించి బిజెపి అతన్ని ఆకర్షిస్తోందని వారి సందేహం. పాండేకు షోకాజ్ నోటీసు యిచ్చారు. దానిపై పాండే యింకా విరుచుకుపడ్డాడు. ‘‘పార్టీ పుట్టిన దగ్గర్నుంచి వున్నాను. ఏమనుకుంటున్నారు నా గురించి?’’ అంటూ. అతనితో పాటు పంచాయితీ మంత్రి అయిన సువ్రత ముఖర్జీ ‘సుందర్బన్స్లో సహాయ కార్యక్రమాలు సరిగ్గా సాగటం లేదంటూ దానికి యిన్‌చార్జిగా వున్న జూనియర్ మంత్రి మంటూరామ్ పఖీరాను దుయ్యబట్టాడు.
బిజెపి కన్నేసిన మరో తృణమూల్ నేత, మంచి వక్త, రవాణా మంత్రి శుభేందు అధికారి. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అతనికి పడటం లేదు. అభిషేక్ వచ్చాక పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిందని శుభేందుకు కినుకగా వుంది. అభిషేక్ సలహా మేరకే ప్రశాంత్ కిశోర్‌ను తెచ్చారని, ప్రశాంత్ తమ సలహాలను పట్టించుకోవటం లేదని అతనికి కోపంగా వుంది. ప్రశాంత్ మార్చి 2న ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదతను.
అందుకే బిజెపి వల విసిరిందని, దానిలో అతను పడతాడనే భయంతో తృణమూల్ అతని బాధ్యతలు తగ్గించింది. గతంలో ఏడు జిల్లాలకు ఇన్చార్జిగా వుంటే యిప్పుడు ఐదిటిని తీసేసుకుని అభిషేక్ అనుచరులకు అప్పగించింది. ఇలా బిజెపి తృణమూల్ నుంచి వచ్చినవారితోనే పార్టీని బలపరుచుకోవాలని చూస్తోంది. బెంగాలీయేతరులను ఆకట్టుకోవాలని చూస్తోంది. హిందూత్వ కార్డు ఎలాగూ వుంది. వీరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2020)
[email protected]