జగన్ మరోసారి పాదయాత్ర చేయక తప్పదా?

వైసీపీ సర్కిల్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్లకు కొదవలేదు. గతంలో ఇలాంటివి చాలానే చర్చకొచ్చాయి. ఇప్పుడు మళ్లీ మరో చర్చ మొదలైంది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేసి, అదే స్పీడ్…

వైసీపీ సర్కిల్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్లకు కొదవలేదు. గతంలో ఇలాంటివి చాలానే చర్చకొచ్చాయి. ఇప్పుడు మళ్లీ మరో చర్చ మొదలైంది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేసి, అదే స్పీడ్ తో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు జగన్. 

ఇప్పుడు మరోసారి జగన్ పాదయాత్ర చేయాల్సిన టైమ్ వచ్చిదంటున్నారు. ఈసారి అధికారం కోసం కాదంట. ప్రతిపక్షం చేస్తున్న రాద్దాంతాన్ని ఎండగట్టడానికి, ఎల్లో మీడియా చేస్తున్న అకృత్యాల్ని బయటపెట్టడానికి జగన్ మరోసారి జనంలోకి రావాలని, సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేస్తే బాగుంటుందని హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.

అవసరమే.. కానీ..!

పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న జగన్, వాటిని పారద్రోలేందుకు నవరత్నాలు అమలులో పెట్టారు. మరి ఆ పథకాల అమలు ఎలా ఉంది. నిజంగానే ప్రజలు తమ కష్టాల నుంచి గట్టెక్కారా అనే విషయం తెలుసుకోవాలంటే కచ్చితంగా జగన్ ప్రజల్లోకి రావాల్సిందే. మరి అది పాదయాత్ర రూపంలో ఉండాలా లేక, రచ్చబండ రూపంలో జిల్లాల్లో ముఖ్య ప్రాంతాల్లో పర్యటించాలా అనేది తేలాల్సి ఉంది. ప్రజల్లోకి రావడమే ఉత్తమం అని డిసైడ్ అయితే దానికి పాదయాత్ర కంటే మరో మంచి ప్రత్యామ్నాయం ఉండదు.

అయితే గతంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అందరూ ఆయన వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకున్నారు, ఈ దఫా ముఖ్యమంత్రి హోదాలో వస్తారు, ప్రజలు కష్టాలు చెప్పుకుంటే తమకి మూడుతుందని అధికారులు ఆలోచించే అవకాశం కూడా ఉంది. మరి ప్రజలు జగన్ వద్దకు అంత చొరవగా రాగలరా..? వచ్చి తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోగలరా..? అనేది అనుమానమే.

ఏర్పాట్లు కష్టమవుతాయా..?

సీఎం హోదాలో జగన్ పాదయాత్ర చేపడితే.. కచ్చితంగా సెక్యూరిటీ టైట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు భారీగా ఉంటాయి. సీఎం బస ఏర్పాట్లు కూడా అధికారులకు కత్తిమీద సామే. 

అందులోనూ సీఎం హోదాలో ఉండి ఎవరూ ఇలాంటి పాదయాత్రలు చేయలేదు. ఒకవేళ జగన్ నిజంగా జనాళ్లోకి వచ్చి యాత్ర చేస్తే అది రికార్డే అవుతుంది.

అవసరమే లేదంటున్న మరో బ్యాచ్..

జగన్ పాదయాత్ర అవసరం ఉందని అని గట్టిగా చెప్పేవారున్నట్టే.. అసలు అవసరమే లేదని అనేవారు కూడా ఉన్నారు. జగన్ చేసిన మంచి పనులు జనాల్లోకి వెళ్లాయి కదా, ఇక జగన్ కూడా వెళ్లాలా అని వీరు ప్రశ్నిస్తున్నారు. 

యాత్రలతో ఓట్లు పడవని, మంచి పనులతోనే పడతాయని, నవరత్నాల అమలుతో మరో పాతికేళ్లు జగన్ కి ఢోకా ఉండదని ఢంకా బజాయిస్తున్నాయి. జగన్ పాదయాత్ర చేపడితే.. ఓటమి భయంతోనే ఆయన మరోసారి జనంలోకి వచ్చారనే అపవాదు కూడా ఎదురవుతుందని చెబుతున్నారు.

అసలు జగన్ మనసులో ఏముంది..?

పాదయాత్ర అయినా, రచ్చబండ అయినా, పేరేదైనా జగన్ కి మాత్రం జనాల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. నవరత్నాల పథకాల అమలు తీరుని ఆయన ప్రత్యక్షంగా మదింపు చేయాలనుకుంటున్నారు. 

మరోవైపు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఆయనలో ఉంది. అన్నిటికీ మించి అభ్యర్థుల్ని ఖరారు చేయడానికైనా నియోజకవర్గాల పర్యటన తప్పనిసరి. దీని కోసం జగన్ కచ్చితంగా జనంలోకి వస్తారని ఆయన మనసు తెలిసినవారు భావిస్తున్నారు.

తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాల్సిందే..

అన్నిటికీ మించి వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను జగన్ సమర్థంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు తమ వాణి వినిపిస్తున్నా.. నేరుగా జగన్ చెప్పే వివరణ మరోలా ఉంటుంది. 

టీడీపీ నీచ రాజకీయాల్ని, ఎల్లో మీడియా అరాచకాల్ని జగన్ చెబితేనే ప్రజలు వింటారట. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పడంకంటే జగన్ చెబితేనే ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు. ఈ ఎజెండాతో జగన్ ప్రజల్లోకి రావాలని అంటున్నారు.

ఈ చర్చ బాగుంది కానీ, జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారా? మరీ ముఖ్యంగా ఈ ఎజెండాతో ఆయన జనం మధ్యలోకి వస్తారా అనేది అనుమానం.