టీటీడీ నూతన పాలక మండలిలో పెద్ద పదవి దక్కుతుందని భావించిన వైసీపీ ఎమ్మెల్యేకి చివరికి “చింతే” మిగిలింది. పెద్ద పదవి కాదు కదా, చివరికి శ్రీవారికి సేవ చేసుకునేందుకు ఎలాంటి పదవికి నోచుకోకపోవడం గమనార్హం. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందనే మాటే గానీ, ఎలాంటి పదవికి నోచుకోలేదని చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆవేదన చెందుతున్నారు.
పీలేరులో నల్లారి కుటుంబంపై సుదీర్ఘ కాలంగా ఆయన రాజకీయ పోరు సాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమా ర్‌రెడ్డి తమ్ముడు కిషోర్‌రెడ్డిపై గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అంతకు ముందు కిరణ్‌పై గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక కీలక పదవి దక్కుతుందని చింతల రామచంద్రారెడ్డి ఆశించారు. ఇప్పటికి రెండున్నరేళ్ల పాలన పూర్తయింది.
కాలం గడిచేకొద్దీ ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు, అలాగే టీటీడీ నూతన పాలక మండలి ఏర్పాటు చేస్తారనే వార్తలు చింతల రామచంద్రారెడ్డిలో ఆశలు చిగురింపుజేశాయి. కొంత కాలం క్రితం సీఎం జగన్‌ను కలిసి తన మనసులో మాటను వెల్లడించారు. అలాగే తన జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్‌రెడ్డితో కూడా చర్చించి, కీలక పదవి కోసం సిఫార్సు చేయించుకున్నారు.
అంతటితో ఆయన ప్రయత్నాలు ఆగలేదు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను కలిసి తనకు సముచిత స్థానం కల్పించాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవిని సుబ్బారెడ్డి మరోసారి దక్కించుకున్నారు. కార్పొరేషన్ల పదవులను ఎమ్మెల్యేలకు ఇవ్వకూడదని ప్రభుత్వం ఒక పాలసీగా పెట్టుకోవడంతో అక్కడా నిరాశే ఎదురైంది.
చివరికి టీటీడీ పాలక మండలి సభ్యత్వంపై గంపెడాశలు పెట్టుకుంటే… అక్కడ కూడా ప్రభుత్వం రిక్త హస్తం చూపించింది. దీంతో పీలేరు ఎమ్మెల్యేకు ” చింతే” మిగిలందనే సానుభూతి వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలో వినిపిస్తుండడం గమనార్హం.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే…మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలోని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్‌కు టీటీడీ నూతన పాలక మండలిలో చోటు దక్కేలా చక్రం తిప్పడం విశేషం.