బొచ్చెడు ఆదాయం …అయినా ఇదేం రోగం?

ప్రభుత్వానికి ఆదాయం వస్తోందంటే అందులో ఎక్కువ భాగం సామాన్యులు పన్నుల రూపంలో చెల్లించే డబ్బే. ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం ఇచ్చేది సామాన్యులే. సంపన్నులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎక్కువమంది ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడానికే…

ప్రభుత్వానికి ఆదాయం వస్తోందంటే అందులో ఎక్కువ భాగం సామాన్యులు పన్నుల రూపంలో చెల్లించే డబ్బే. ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయం ఇచ్చేది సామాన్యులే. సంపన్నులుగానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎక్కువమంది ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడానికే ప్రయత్నాలు చేస్తారు. ఎగ్గొడతారు కూడా. పన్నులు చెల్లించాలని అడిగితే బెదిరించే ప్రజా ప్రతినిధులు, దౌర్జన్యాలు చేసే ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. చివరకు కరెంటు బిల్లులు సైతం ఎగ్గొట్టేవారు చాలామంది ఉన్నారు. పోనీ …వారికేమైనా ఆదాయం తక్కువగా ఉంటుందా? ఉండదు. 

ప్రభుత్వం ఇచ్చే జీతాలు, అలవెన్సులు కలుపుకుంటే చాలా ఆదాయం ఉంటుంది. ఇది కాకుండా ఉచిత సౌకర్యాలు కూడా ఉంటాయి. దందాల ద్వారా, అవినీతి అక్రమాల ద్వారా వచ్చే ఆదాయానికి తక్కువేమీ ఉండదు.  అయినప్పటికీ ఎక్కడైనా డబ్బు చెల్లించాల్సి వస్తే పీచుతనం చేస్తారు.

ప్రజాప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైనవారు ) తాము దైవంశ సంభూతులమని అనుకుంటారు. ఏపీలో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అలాగే అనుకుంటున్నాడు. ఈయన మాజీ పోలీసు అధికారి కదా. ఒక పోలీసు అధికారికి ఉండే పొగరు ఆయనకు ఇప్పటికీ ఉంది. ఎవ్వరినీ లెక్కచేయనితనం ఉంది. తనను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారం ఉంది. కొంతకాలం కిందట న్యూడ్ వీడియోతో పరువు పోగొట్టుకున్న మాధవ్ లో, ఆయన పొగరులో ఏమాత్రం మార్పురాలేదు. ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు. మూడున్నర సంవత్సరాలుగా అద్దె, విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని మాధవ్ అద్దెకుండే ఇంటి యజమాని మల్లికార్జునరెడ్డి ఆరోపించాడు.

గోరంట్ల మాధవ్ తాను ఎంపీగా గెలుపొందాక ఉండటం కోసం మల్లికార్జునరెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతపురంలో మొత్తం ఏడున్నర సెంట్ల స్థలంలో ఉన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆరు నెలలు దాటి మూడు సంవత్సరాలైనా ఇంతవరకు ఖాళీ చేయలేదు. అద్దెకు దిగే సమయంలో 6 నెలలే ఉండి ఖాళీ చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇంతవరకు రూపాయి కూడా అద్దె చెల్లించలేదు. మరికొద్దిరోజులు ఇంట్లో ఉంటానని చెప్పాడు. మూడున్నర సంవత్సరాల నుంచి అద్దెతోపాటు విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో సెప్టెంబరు నెలలో ఖాళీ చేయాలని మల్లికార్జునరెడ్డి కోరాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం రేకెత్తింది.

పోలీసులు, పలువురు రాజకీయ నాయకులు కల్పించుకుని మరో 2 నెలలు ఉండేలా అక్టోబరు వరకు గడువు ఇప్పించారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకపోవడంతో మల్లికార్జునరెడ్డి మరికొందరు పెద్దలను తీసుకొని ఎంపీ దగ్గరకు వెళ్లి ఇంటిని ఖాళీ చేయాలని కోరాడు. ఎంపీ వాగ్వాదానికి దిగడంతోపాటు ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెప్పాడు. పోలీసు అధికారులు చెప్పినా వినలేదు. పైగా ఇంటి యజమానిని బెదిరించాడు. అద్దెకింద రూ.13 లక్షలు, విద్యుత్తు బిల్లుల కింద రూ. 2,50,413 మాధవ్ చెల్లించాల్సి ఉంది. ఎంపీ అయ్యాక మాధవ్ ఆదాయానికి తక్కువేమీ లేదు. ఎంపీగా ఆయన జీతం నెలకు 70 వేలు. నియోజకవర్గ అలవెన్స్ నెలకు 49 వేలు, ఆఫీసు అలవెన్స్ కింద 54 వేలు, ఇతర అలవెన్సుల కింద మరో 14 వేలు వస్తాయి. ఈ లెక్కన నెలకు లక్షా 90 వేల ఆదాయం ఉంది. 

మరి ఇంత ఆదాయం ఉన్నప్పుడు అద్దె కట్టవచ్చు కదా. ఇది పైకి కనిపించే ఆదాయం. మాధవ్ పెద్ద నిజాయితీపరుడు అనుకోలేం. కాబట్టి ఇతరత్రా ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. గోరంట్ల మాధవ్ కు వివాదాలు కొత్తేమీ కాదు. ఇటీవల సోషల్ మీడియాలో ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందిన అభ్యంతరకర వీడియో వైరల్ అయింది. అందులో ఎంపీ చొక్కా లేకుండా ఒక మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన నగ్నంగా కాల్ మాట్లాడాడు అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. 

అయితే గోరంట్ల మాధవ్….టీడీపీ నేతలు వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపించాడు. తాను జిమ్ లో ఉండగా వీడియో తీసుకున్నానని, ఆ వీడియోను, ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ అప్పట్లో వివరణ ఇచ్చాడు. ఆ వీడియో ఒరిజినల్ కాదని అప్పట్లో ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఎంపీ దురుసు వైఖరివల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెడ్డ పేరు వస్తోందని అధిష్టానం ఆగ్రహంతో ఉంది. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇష్టపడటంలేదు.